
మత్స్యకార సంక్షేమ సమితి (MSS) ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న బాల సంస్కార కేంద్రాల ఉపాధ్యాయుల ప్రశిక్షణ తరగతులు శ్రీకాకుళం నగరం దమ్మలవీధిలోని MPE స్కూల్ లో జరిగాయి. ఈ కార్యక్రమంలో మత్స్యకార సొసైటీ జిల్లా అధ్యక్షులు శ్రీ కొనాడ నర్సింగరావు పాల్గొని మత్స్యనారాయణ స్వామి చిత్రపటానికి పూలమాల వేశారు.
సామాజిక సమరసత వేదిక -ఆంధ్రప్రదేశ్ సాహిత్య ప్రముఖ్ శ్రీ ఐనాడ దుర్గా ప్రసాద్ ఉపాధ్యాయులుకు తెలుగు భాషా నైపుణ్యాలను, అక్షరములతో పదాలు, వాక్యాలు, కధల నిర్మాణ నైపుణ్యాలను గూర్చి వివరించారు. బాల సంస్కార కేంద్రాల ద్వారా- విద్యార్థులలో ఉన్నత విలువలు, చదువులో ప్రగతి పెంపొందుతాయని సోదాహరణంగా వివరించారు. ఉపాధ్యాయ,విద్యార్థుల మధ్య వాత్సల్య పూర్వక వాతావరణం ఉండాలని, అలాంటి వాతావరణంలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించగలమని శ్రీ దుర్గాప్రసాద్ ఉపాధ్యాయులకు ఉద్బోధించారు. అభినయ గేయాలు పాడించి, ఉపాధ్యాయులను ఉత్సాహపరచి, మంచి సందేశం ఇచ్చారు.
బాల సంస్కార కేంద్రాల పర్యవేక్షకులు శ్రీ జలుమూరు సత్యం ఉపాధ్యాయులకు నెలవారీ ప్రార్ధనా శ్లోకాలు, పాట, పద్యం, సుభాషితం, కథలు వంటి వాటిని నేర్పారు. విద్యార్థుల ప్రగతి నివేదికలు, కేంద్ర కమిటీ వివరాలు తీసుకొని, సమయపాలన, రాబోవు నెలలలో చేయవలసిన కార్యక్రమాలను ఉపాధ్యాయులకు వివరించారు.





