
ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో బ్రిటన్ ను దాటేసి మన దేశం ఐదో ఆర్థిక శక్తిగా అవతరించడంపై యావత్ భారతావని హర్షిస్తోంది.
ఒకప్పుడు మన దేశాన్ని వలసరాజ్యంగా మార్చి పాలించిన యూకే… ఇప్పుడు భారత్ కంటే వెనుకబడి పోవడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని పలువురు పారిశ్రామికవేత్తలు ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో స్పందించారు. ఓ ఆంగ్ల మీడియా సంస్థ కథనాన్ని షేర్ చేస్తూ.. ”కర్మ సిద్ధాంతం పనిచేసింది. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో కష్టపడి పోరాడి, త్యాగాలు చేసిన ప్రతి భారతీయుడి హృదయం ఈ వార్తతో ఉప్పొంగిపోతుంది. అంతేగాక, భారత్ గందరగోళంలో పడిపోతోందని భావించిన వారందరికీ ఇదో గట్టి సమాధానం” అని మహీంద్రా రాసుకొచ్చారు.

అటు కొటక్ మహీంద్రా సీఈవో ఉదయ్ కొటక్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ”మన వలస పాలకులైన యూకేను అధిగమించి భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించడం గర్వించదగ్గ క్షణం” అని ఆయన ట్వీట్ చేశారు. అయితే తలసరి జీడీపీలో యూకే మనకంటే ఇంకా ముందు ఉందని, ఇంకా మనం సాధించాల్సింది ఉందని గుర్తుచేశారు. వేదాంతా రిసోర్సెస్ లిమిటెడ్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ స్పందిస్తూ.. ”వేగంగా అభివృద్ధి చెందుతోన్న భారత ఆర్థిక వ్యవస్థ మెచ్చుకోదగ్గ మైలురాయిని చేరుకుంది. బ్రిటన్ ను అధిగమించి ఐదో ఆర్థిక శక్తిగా ఎదగడం అభినందనీయం. మరి కొద్ది సంవత్సరాల్లోనే భారత్ ఖచ్చితంగా టాప్ 3లో ఉంటుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు. సరిగ్గా దశాబ్దం క్రితం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ 11వ స్థానంలో ఉండగా.. బ్రిటన్ ఐదో స్థానంలో నిలిచింది. తాజాగా యూకేను దాటేసి భారత్ ఐదో స్థానానికి ఎగబాకడం విశేషం. భారత్ కంటే ముందు అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.





