News

గోరంట్ల మాధవ్ ఘటనపై చర్యలకు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశం

385views

* తగిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్ కు సూచన

హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా నేతలు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి అందజేసిన ఫిర్యాదును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపింది.

ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మాధవ్‌ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యవహారంపై రాష్ట్రానికి చెందిన డిగ్నిటీ ఫర్‌ ఉమెన్‌ జేఏసీ నేతలు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్ ‌తో పాటు జాతీయ మహిళా కమిషన్‌, పలువురు కేంద్రమంత్రులను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

అయితే, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి మహిళా నేతలు ఇచ్చిన ఫిర్యాదు విషయంలో ఆమె కార్యాలయం తాజాగా స్పందించింది. ఈ నెల 23న మహిళా జేఏసీ నేతలంతా రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారని.. ఆ కాపీని ఏపీ సీఎస్ ‌కు పంపి ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు లేఖలో పేర్కొంది. ఈ మేరకు మహిళా జేఏసీ కన్వీనర్‌ చెన్నుపాటి కీర్తికి సమాచారం ఇస్తూ రాష్ట్రపతి కార్యాలయం లేఖ పంపింది. ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లున్న వీడియో ఒకటి రాష్ట్రంలో ఇటీవల తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.