
“ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలన క్రైస్తవులకు కొమ్ము కాస్తోంది, మతమార్పిడులకు అవకాశం కల్పిస్తోంది” అని కేవలం ఇప్పటి వరకు విన్నాం.. కానీ ఇప్పుడు అది ఋజువులతో సహా బయటపడింది. ప్రభుత్వంలో కొందరు అధికారుల అండ దండలతో మిషనరీలు అటవీ భూములను సైతం ఆక్రమించుకుని చర్చిల నిర్మాణానికి ఎలా పూనుకుంటున్నాయో ఆర్గనైజర్ పత్రిక వెల్లడించింది. అయితే సమయానికి స్థానిక హిందూ బంధువులు, లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ వంటి న్యాయ వేదికలు అధికారిక పత్రాలను ఋజువులుగా పెట్టి ఈ వ్యవహారాన్ని ఛేదించి అడ్డుపడడంతో మిషనరీల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇప్పుడే కాదు గత టీడీపీ హయాంలో కూడా క్రైస్తవుల విషయంలో అనుసరించిన సంతుష్టీకరణ చర్యలు కూడా న్యాయ వేదికల దృష్టికి వచ్చాయి. అయితే ఇపుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నేరుగా చర్చిల నిర్మాణానికి నిధులు సమకూరుస్తున్న పరిస్థితి ఏర్పడింది.
గుంటూరు జిల్లాలో మూడు చర్చిల నిర్మాణానికి మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా నిధులు విడుదల చేస్తూ 2019 డిసెంబర్ 27న ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో ఏపీ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చర్చికి రూ. 5 లక్షల చొప్పున, రూ. 15 లక్షలు మంజూరుకు మైనారిటీ సంక్షేమ సంస్థకు ప్రతిపాదనలు అందాయి. చర్చిల నిర్మాణానికి పూర్తి స్థాయి నిధులు విడుదల చేయడానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కి సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం పాలనాపరంగా నిధులు విడుదలకు ఉత్తర్వులు (జీవో) జారీ చేసేసింది. క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ రూ. 15లక్షల నిధులను జిల్లా కలెక్టర్ పేరున విడుదల చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ సంతుష్టీకరణ, బుజ్జగింపు చర్యలపై బీజేపీ గట్టిగా నిరసన వ్యక్తం చేసింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మౌనంగా ఉండిపోయింది. ఆ పార్టీ గతంలో తన పాలనలో కూడా ఇటువంటి సంతుష్టీకరణ విధానాలనే అవలంబించింది. ఇప్పుడు కూడా అందులో ఎటువంటి మార్పు కనిపించడంలేదు.
కఠోర సత్యాలను వెల్లడించే పత్రాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ వెలికితీసింది. చర్చిల నిర్మాణానికి జగన్ ప్రభుత్వం సహాయం చేస్తున్నా ఎందుకు టీడీపీ మౌనం వహిస్తోంది అనే విషయం ఆ పత్రాల ద్వారా బయటపడింది. 2018-19 మధ్య చర్చిల నిర్మాణాలు, మరమ్మతులకు రూ.38.36 కోట్లు అప్పటి టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి 54 జీవో లు విడుదల చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అంతే కాదు చర్చిల్లో మరుగుదొడ్ల మరమ్మతులు, నిర్మాణాలకు జీవో ఆర్.టి. నెంబర్ 408 ద్వారా 2018 నవంబర్ 29న జీవో జారీ చేస్తూ మరో రూ.58 లక్షలు విడుదల చేసింది ప్రభుత్వం. తన అధికారాన్ని కాపాడుకోడం కోసం చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు ఈ నిధులు విడుదల చేయడమే కాదు, సంతుష్టీకరణ కోసం క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేరుస్తామని కూడా హామీ ఇచ్చాడు.
క్రైస్తవ మత ప్రచారానికి వచ్చిన వారందరికీ అండగా నిలుచుని వివిధ కార్యక్రమాల్లో వారికి సహకరించడం గత తెలుగు దేశం హయాంలోనూ జరిగింది. ఇప్పుడూ జరుగుతోంది. ఇటువంటి చర్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టి ఎల్.ఆర్.పీ.ఎఫ్ తీవ్రంగా పోరాటం చేస్తోంది. ఇటీవల ఈ సంస్థ ప్రయత్నం వల్ల కర్నూలులో అక్రమంగా మసీదు, చర్చి నిర్మాణం ఆగింది. ఇలా నిలువరించి ఉండకపోతే కొందరు అధికారులే అటవీ భూములు, ప్రభుత్వ భూములలో చర్చిల నిర్మాణానికి తోడ్పాటు ఇచ్చేవారు. ఏకంగా ప్రభుత్వమే చర్చిల నిర్మాణానికి నిధులు అధికారికంగా విడుదల చేస్తోందంటే పరిస్థితి ఎంత పరాకాష్టకు చేరిందో అర్థం అవుతుంది. అయితే న్యాయ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం కేంద్రం ఒక చట్టం చేసి మతపరమైన అంశాలను రాష్ట్ర పాలనలో చొప్పించకుండా చేస్తే ఇటువంటి దుష్టాంతాలు కొంతవరకు నిలువరించవచ్చన్నది అభిప్రాయం. ఓట్ల కోసం బుజ్జగింపు, సంతుష్టీకరణ చర్యలకు ఒడిగడితే అది దేశ సంస్కృతీ సంప్రదాయాలకు గొడ్డలి పెట్టు అవుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.