News

మసూద్ అజర్ కు షాక్

570views

జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ కు భారీ షాక్ ఇచ్చారు. మసూద్‌ అజర్‌ ఆస్తులను స్తంభింపచేస్తామని ఫ్రాన్స్‌ ప్రకటించింది. ఫ్రాన్స్‌ దేశీయాంగ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రకటన చేశాయి. ఉగ్రవాదంతో ప్రమేయమున్న వ్యక్తిగా మసూద్‌ అజర్‌ పేరును ఐరోపా యూనియన్‌ జాబితాలో చేర్చబోతున్నామని  ఫ్రాన్స్‌ అధికారికంగా వెల్లడించినట్లే. ఇది భారత్ కు నిజంగా కలిసొచ్చే అంశమే..! మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఫ్రాన్స్‌, బ్రిటన్‌, అమెరికా ఇప్పటికే కోరుతున్నాయి.

ఇక మసూద్ అజర్ విషయంలో సుష్మా స్వరాజ్ పాక్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ ముందు ఒకే ఒక్క దారి ఉందని సుష్మా హెచ్చరించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను భారత్ కు అప్పగించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆమె అన్నారు. పుల్వామా తరహా ఘటన మరోసారి చోటుచేసుకుంటే, తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.ఉగ్రవాదం, చర్చలు రెండూ కలసి ముందుకు సాగవని.. ఉద్రిక్తతలను నివారించడానికి భారత్ శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని, ఇదే సమయంలో పాకిస్థాన్ నుంచి సరైన చర్యలను భారత్ ఆశిస్తోందని అన్నారు. పుల్వామా దాడుల తర్వాత భారత్ మరింత తీవ్రంగా స్పందిస్తుందని పాకిస్థాన్ ఆందోళన చెందుతోందని సుష్మ అన్నారు. పుల్వామా దాడులను ఖండిస్తూ పలు దేశాల విదేశాంగ మంత్రులు తనకు ఫోన్ చేసి, సంఘీభావాన్ని ప్రకటించారని తెలిపారు. ఇదే సమయంలో పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా చూడాలని కోరారని సుష్మ చెప్పారు.