News

అంతర్జాతీయ చెస్ పోటీల్లో కానరాని రాష్ట్రపతి, ప్రధాని చిత్రాలు

325views
  • డీఎంకే ప్రభుత్వంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం, వారి ఫోటోలు తప్పనిసరని ఆదేశం

చెన్నై: చెస్ ఒలింపియాడ్ సహా అన్ని అంతర్జాతీయ ఈవెంట్ల ప్రచార పోస్టర్లలో రాష్ట్రపతి , ప్రధాన మంత్రి ఫొటోలను ముద్రించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వం ఏదైనప్పటికీ, వీరి ఫొటోలను అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అడ్వర్టయిజ్‌మెంట్లలోనూ ముద్రించాలని తెలిపింది.

చెస్ ఒలింపియాడ్‌కు సంబంధించి అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఇచ్చే ప్రకటనల్లో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ఫొటోలను ప్రచురించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో ఏదైనా అంతర్జాతీయ కార్యక్రమానికి ఆతిథ్యమిస్తే, ఆ కార్యక్రమంలో పాల్గొనే ప్రతినిధుల పేర్లను ప్రచురించాలని తెలిపింది.

రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి ఫొటోలతో కూడిన ప్రకటనలకు ఎటువంటి నష్టం జరగకుండా జాగ్రత వహించాలని జిల్లా పరిపాలనా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఒకవేళ ఈ ప్రకటనలకు ఏదైనా నష్టం జరిగితే అందుకు బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది.

చెస్ ఒలింపియాడ్ ప్రకటనల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటోను ప్రచురించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. 44వ చెస్ ఒలింపియాడ్ ప్రకటనల పోస్టర్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బొమ్మను ప్రచురించకపోవడంపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టర్లకు మోదీ ఫొటోను అతికిస్తున్నారు. మోదీ బొమ్మ ఉన్న పోస్టర్‌పై సిరా జల్లిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. FIDE 44వ ఒలింపియాడ్ జూలై 28న ప్రారంభమైంది, వచ్చే నెల 10 వరకు జరుగుతుంది. ఈ ఈవెంట్‌ మన దేశంలో జరగడం ఇదే తొలిసారి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి