
బెంగళూరు: బీజేపీ యువ మోర్చా జిల్లా కమిటీ సభ్యుడు ప్రవీణ్ నెట్టారు హత్య కేసును కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏకు అప్పగించారు. హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామమని, కారణమైన సంస్థలనూ వదిలేది లేదని ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సందర్భంగా ముఖ్యమంత్రి నిన్న హామీ ఇచ్చారు.
ప్రవీణ్ నెట్టారు కుటుంబ సభ్యులను గురువారం సాయంత్రం సీఎం బసవరాజు బొమ్మై కలిసి ఓదార్చారు. సీఎం సహాయనిధి నుంచి రూ. 25 లక్షల చెక్‌ను వారికి అందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రవీణ్ హత్య అత్యంత హేయమని, ఇదొక ముందస్తు ప్రణాళికలో జరిగిన హత్య అని చెప్పారు.
దక్షిణ కన్నడ జిల్లాలో గత పదేళ్లలో అసాంఘిక శక్తుల అకృత్యాలు పెచ్చుమీరాయని తెలిపారు. కేరళ నుంచి కూడా ఈ విధమైన అకృత్యాలకు ప్రోత్సాహం అందుతోందని ఆరోపించారు. అంతే కాదు అవసరమైతే ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు అవలంబిస్తున్న విధానం తాము కూడా అమలు చేస్తామని హెచ్చరించారు.
యూపీలో అల్లర్లకు పాల్పడే వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం యోగి సర్కారు విధానాన్ని పరిస్థితులను బట్టి కర్ణాటకలో కూడా అమలు చేస్తామని బొమ్మై స్పష్టం చేశారు.
మరోవైపు ఈ హత్య కేసులో కేరళ రాష్ట్రం కాసరగోడులో ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి సుళ్య తాలూకాలో ప్రవీణ్ నెట్టారు హత్య జరిగిన వెంటనే ఏడీజీపీ అలోక్ కుమార్ పర్యవేక్షణలో ఆరు ప్రత్యేక బృందాలు హంతకుల వేట చేపట్టాయి.
హత్య కేసులో ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న షఫీక్ బెళ్లారె, జాకీర్ సవణూరును కేరళ రాష్ట్రం కాసరగోడు పట్టణంలో అరెస్టు చేసినట్టు ఏడీజీపీ అలోక్ కుమార్ బెంగళూరులో ప్రకటించారు.
ఈ కేసులో ఇప్పటిదాకా 21 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వీరిలో ఏడుగురు ఎస్‌డీపీఐకి చెందిన కార్యకర్తలున్నారు. ప్రవీణ్ నెట్టారు హత్య పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పనేనని, ఆ సంస్థను నిషేధించాలంటూ తాము కేంద్రానికి నివేదిస్తామని సీఎం బొమ్మై చెప్పారు.
Source: Nijamtoday





