News

భోపాల్‌లో పోలీస్ కాలర్ పట్టుకున్న దిగ్విజయ్ సింగ్!

439views

భోపాల్‌: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ శుక్రవారం భోపాల్‌లో పోలీసు సిబ్బందితో ఘర్షణకు దిగడమే కాకుండా, వారిలో ఒక పోలీస్ కాలర్ పట్టుకొని నిలదీయడం కలకలం రేపింది. మహిళా ఓటరును జిల్లా పంచాయతీ కార్యాలయం ఆవరణలోకి రానీయకుండా అడ్డుకోవాలని కోరుతూ సింగ్, పోలీసు సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

సీనియర్ కాంగ్రెస్ నాయకుడి చర్యను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సింగ్ తీవ్రంగా ఖండించారు, “ఆయన (దిగ్విజయ సింగ్) ఒక పోలీసును కాలర్ పట్టుకున్నారు.. నేను సోనియా గాంధీని అడగాలనుకుంటున్నాను, ఆమె దీనికి మద్దతు ఇస్తుందా? రాహుల్ గాంధీ అలా చేయమని అడిగారా?” అంటూ నిలదీశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగలేదని ఆయన విస్మయం చెందారు. దిగ్విజయ పోలీసులతో ప్రవర్తించిన తీరు మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగదని హితవు చెప్పారు. ఇలాంటి దురహంకార చర్యల వల్ల కాంగ్రెస్‌ తన పునాదిని కోల్పోతున్నదన్న వాస్తవానికి అద్దం పడుతుందని సీఎం స్పష్టం చేశారు.

భోపాల్ జన్‌పద్ పంచాయతీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల సందర్భంగా “తీవ్ర అక్రమాలు” జరిగాయని ఆరోపిస్తూ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్, ఇతరులు పోలీసులతో ఘర్షణకు దిగారు.

అయితే, తమ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 41 జిల్లా పంచాయతీలలో అధ్యక్ష పదవిని గెలుచు కోవడం, కాంగ్రెస్ 10 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి రావడంతో ఆ పార్టీ నాయకులు తట్టుకోలేక పోతున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు విమర్శించారు. మధ్యప్రదేశ్‌లోని 52 జిల్లాలు ఉండగా, ఒక్క సిద్ధిలో మాత్రం హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ ఎన్నికలు జరగలేదు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి