ArticlesNews

తెల్లదొరలకు ముచ్చెమటలు పట్టించిన స్వదేశీ ఉద్యమం

8views

( 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభం )

విదేశీ ఆక్రమణదారుల నుంచి దేశాన్ని రక్షించుకోవాలనే భావన 18వ శతాబ్దపు ద్వితీయార్థంలో బలం పుంజుకుంది. మొగలుల నుంచి భారతదేశ పరిపాలనను గుంజుకున్న బ్రిటిషర్ల అరాచకాలు, అక్రమాలపై దేశ ప్రజల్లో వ్యతిరేకత గణనీయంగా పెరిగింది. దానికి నిదర్శనమే స్వదేశీ ఉద్యమం.

తొలుత ఈస్టిండియా కంపెనీ, ఆ తరువాత నేరుగా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని తమ గుప్పెట్లోకి తీసుకున్నాయి. మొదట పరిపాలనా వ్యవహారాలకే పరిమితమైన తెల్లదొరతనం, దేశంలోని స్వదేశీ రాజ్యాలను లాగేసుకుంది. అక్కడితో ఆగకుండా సగటు భారతీయుడి సామాన్య జీవనంపై ప్రభావం చూపించే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంది. చివరికి భారతదేశం నుంచి పత్తిని ఇంగ్లండ్‌కు తక్కువ ధరలకు తీసుకువెళ్ళి, అక్కడ వస్త్రాలు తయారుచేసి వాటిని అధిక దరలకు భారతదేశంలో విక్రయించడం స్థానిక పరిశ్రమలను దారుణంగా దెబ్బతీసింది. దానివల్ల సగటు భారతీయుడిలో తీవ్రమైన అసంతృప్తి ప్రజ్వరిల్లింది. అలాంటి సమయంలో 1903 డిసెంబర్‌లో నాటి బ్రిటిష్ సర్కారు బెంగాల్‌ను విభజించాలని నిర్ణయం తీసుకుంది.

లార్డ్ కర్జన్ నేతృత్వంలోని తెల్ల దొరతనం బెంగాల్ విభజనకు నిశ్చయించుకుంది. సుమారు 8 కోట్ల జనాభా కలిగిన బెంగాల్ ప్రొవిన్స్‌ను పాలనా సౌలభ్యం కోసమే విభజించబోతున్నామని బ్రిటిష్ వారు బైటకు చెప్పారు. కానీ ఆ నిర్ణయానికి అసలు కారణం వేరు. భారతదేశంలో తిరుగుబాటుకు బెంగాల్ కేంద్రస్థానంగా ఉంది. అక్కడ తమకు వ్యతిరేకంగా జరుపుతున్న నిరసనలను బ్రిటిష్ వారు అదుపు చేయలేకపోతున్నారు. పైగా, బెంగాల్ నుంచి తిరుగుబాటు మంటలు అచిరకాలంలోనే దేశవ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం పొంచివుందని వారు అంచనా వేసారు. ఆ నేపథ్యంలో భారతీయ స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది.

1903 ఆగస్టు 7 కంటె ముందునుంచే విదేశీ వస్తువులపట్ల భారతీయుల్లో విముఖత నెలకొంది. 1850ల నుంచే దాదాభాయ్ నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, బాల గంగాధర తిలక్ వంటివారు జాతీయవాదాన్ని ప్రచారం చేయసాగారు. 1871-72 నాటికే నామ్‌ధారీ సిఖ్ఖులు ఆంగ్లేయుల తయారీ వస్త్రాలను బహిష్కరించారు. వారి నాయకుడు రాంసింగ్ కూకా బ్రిటిష్ వస్తువులు, వస్త్రాలే కాదు విద్యను సైతం బహిష్కరించారు. తెల్ల దొరల నియంత్రణలో ఉన్న పోస్టల్ సేవలను, రవాణా మార్గాలను వినియోగించవద్దని పిలుపునిచ్చారు. ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం రంగూన్ జైలులో నిర్బంధించింది. మరోవైపు వంగభూమిలో అనుశీలన సమితి, జుగంతర్ పార్టీ వంటి సంస్థలు సాయుధ తిరుగుబాట్లు ప్రారంభించాయి.

స్వదేశీ ఉద్యమం 1905 ఆగస్టు 7న లాంఛనంగా ప్రారంభమైంది. దాని ఉద్దేశం ప్రధానంగా విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తు వినియోగమే. భారతీయులు విదేశీ వస్తువులు, వస్త్రాలను కొనరాదని గాంధీ పిలుపునిచ్చారు. దాంతో ప్రజలు చరఖా తిప్పుతూ నూలు వడకడం మొదలుపెట్టారు. భారతీయ వస్తువులు, వస్త్రాల కొనుగోళ్ళు… బ్రిటిష్ వస్తువులు, దుస్తులను అగ్నికి ఆహుతి చేయడం ఊరూరా పుంజుకున్నాయి. ఆ ఉద్యమం దేశంలో జాతీయతావాద వ్యాప్తికి ఊతకర్రగా నిలిచింది. గ్రామ పరిశ్రమలకు తోడ్పాటుగా నిలిచి స్వయంసమృద్ధి ప్రయోజనాలను చాటింది.

బ్రిటిష్ వారి కూటనీతి కారణంగా స్వదేశీ వస్తువుల కంటె విదేశీ వస్తువులే చౌకగా ఉండేవి. అయినా స్వతంత్ర కాంక్షతో భారతీయులు దేశీయ వస్తువులనే ఉపయోగించడం మొదలుపెట్టారు. ఒక అంచనా ప్రకారం స్వదేశీ ఉద్యమం ఫలితంగా బ్రిటిష్ ఉత్పత్తుల అమ్మకాలు దాదాపు 20శాతం తగ్గాయంటే దాని ప్రభావాన్ని అంచనా వేయవచ్చు. అందుకే 1905 ఆగస్టు 7 నుంచీ మొదలైన స్వదేశీ ఉద్యమం తెల్లవారిని గడగడలాడించింది.

విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్త్రాల ప్రోత్సాహం లక్ష్యంగా మొదలైన స్వదేశీ ఉద్యమం ఆధునిక భారతదేశానికి కూడా ఆదర్శప్రాయమే. అందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015 సంవత్సరంలో ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. దేశీయ ఉత్పత్తులను పునరుద్ధరించడం, ప్రజల్లో జాతీయతా స్ఫూర్తిని రగిలించడం లక్ష్యంగా ప్రతీయేటా ఆగస్టు 7న చేనేత పండుగ జరుపుతోంది. ఆ రోజు సంత్ కబీర్ పేరిట చేనేత కళాకారులకు పురస్కారాలు ప్రదానం చేస్తోంది.