
న్యూఢిల్లీ: అంచనాలను నిజం చేస్తూ భారత 15వ రాష్ట్రపతిగా అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. గురువారం పార్లమెంటు ప్రాంగణంలో చేపట్టిన ఓట్ల లెక్కింపులో విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌సిన్హాపై 2,96,626 విలువైన ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు.
రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ చేసిన ప్రకటన ప్రకారం ఆమెకు 6,76,803 విలువైన ఓట్లు రాగా, యశ్వంత్ సిన్హాకు 3,80,177 విలువైన ఓట్లు దక్కాయి. పోలైన 4,754 ఓట్లలో 4,701 ఓట్లు చెల్లుబాటయ్యాయి. మూడో రౌండ్ లెక్కింపు పూర్తయ్యేప్పటికే ద్రౌపదికి 51% ఓట్లు వచ్చినట్టు తేలడంతో గెలుపు ఖాయమైపోయింది. దాంతో యశ్వంత్‌సిన్హా తన ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు.
ఆ వెంటనే ఢిల్లీలో ముర్ము తాత్కాలిక నివాసానికి ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వెళ్ళి అభినందనలు తెలిపారు. రక్షణ మంతి రాజ్‌నాథ్‌సింగ్, హోంమంత్రి అమిత్‌షా ఆమె నివాసానికి వెళ్ళి మిఠాయి తినిపించారు. విజేతకు అభినందనలు చెబుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు.
ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లుగా సాగి రాత్రి 9.30 గంటలకు ముగిసింది. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న ప్రథమ గిరిజన నాయకురాలిగా, రెండో మహిళగా ద్రౌపది ఘనత సాధించారు. ఈ పదవిని చేపడుతున్న అతి తక్కువ వయసున్న వ్యక్తి కూడా ఆమే.
Source: NationalistHub





