
-
చైనా దురాక్రమణను ఎదుర్కొనేందుకు ఆయుధాలు అవసరమని వెల్లడి
వాషింగ్టన్: రష్యా నుంచి ఎస్–400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేస్తున్న భారత్‌పై ట్రంప్ హయాం నుంచి గుర్రుగా ఉన్న అమెరికా తాజాగా సానుకూల నిర్ణయం తీసుకుంది. కీలకమైన కౌంటరింగ్ అమెరికా అడ్వెర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్(కాట్సా) ఆంక్షల నుంచి మినహాయింపు నిచ్చింది. ఇందుకు ఉద్దేశించిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్(ఎన్‌డీఏఏ)కు చేసిన సవరణకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. చైనా వంటి దురాక్రణదారులను నిలువరించేందుకు భారత్‌కు ‘ఎస్–400’ఎంతో అవసరమని పేర్కొంది.
కాట్సా నుంచి మినహాయింపు కల్పిస్తూ భారత్‌కు మద్దతుగా నిలిచేందుకు అధ్యక్షుడు బిడెన్ పరిపాలన తన అధికారాన్ని ఉపయోగించాలని కోరింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఇండో–అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రొ ఖన్నా సభలో ప్రవేశపెట్టారు. ఎంతో ప్రాముఖ్యమున్న ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించడం గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.