NewsSeva

నెల్లూరు జిల్లాలో ఘనంగా యానాదుల సమారాధన.

1.4kviews

నెల్లూరు రూరల్ మండలం దొంతాలి నాంచారమ్మ గిరిజన కాలనీ లో 9/3/2019 ఆదివారం యానాదుల సమారాధన కార్యక్రమం జరిగింది. ఆ గ్రామంలో సమరసతా సేవా ఫౌండేషన్ మరియు తితిదే సంయుక్త అధ్వర్యంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో యానాదుల సమారాధన మరియు వెంకటేశ్వర స్వామి కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయభారత్ హాస్పిటల్ మేనేజర్ శ్రీ గురుప్రసాద్ మాట్లాడుతూ తర తరాలుగా యానాదులలో శ్రీ వెంకటేశ్వర స్వామి సమారాధన నిర్వహించుకునే సాంప్రదాయమున్నదని, అయితే నేడు యానాదులు చెట్టుకొకరు పుట్టకొకరుగా అయిపోయినందువల్ల ఈ ఆచారం కనుమరుగవుతూ వున్నదని తెలిపారు. అయితే గత మూడు, నాలుగు సంవత్సరాలుగా సమరసతా సేవా ఫౌండేషన్, తిరుమల తిరుపతి దేవస్థానం, నెల్లూరు జయభారత్ హాస్పిటల్ ల సంయుక్త అధ్వర్యంలో జిల్లా అంతా కలిపి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సమారాధన కార్యక్రమంలో జిల్లాలోని యానాదులంతా ఉత్సాహంగా అత్యంత భక్తి శ్రద్దలతో పాల్గొంటూ వున్నారని తెలిపారు. ఇప్పుడు కూడా దొంతాలి గ్రామస్థుల కోరిక మేరకు వారి గ్రామంలో సమారాధన నిర్వహించడానికి తమ వంతు సహకారాన్ని అందించామని తెలిపారు.

ఇలా దొంతాలిలో సమారాధన నిర్వహిస్తుండడం తెలిసి గూడూరుకు చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్, SSF రాష్ట్ర కార్యదర్శి శ్రీ కోట సునీల్ కుమార్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహింపజేయడానికి ముందుకు రావడం గమనార్హం. శ్రీ వెంకటేశ్వర కళ్యాణాన్ని దర్శించుకున్న గ్రామీణులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. యానాది యువతీ యువకుల కోలాటం, భజన ఆహూతులను అలరించాయి. చుట్టు పక్కల 10 గ్రామాల నుంచి సుమారు 700 మంది యానదులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో SSF జిల్లా కన్వీనర్ వెంగళరెడ్డి, మరికొందరు స్థానిక SSF, మరియు ఇతర హిందూ సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు.