News

రక్షణ నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్

471views

* అగ్నివీరులకు కేంద్రం తాజా ఆఫర్

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ (Agnipath) పథకంపై కొన్ని రాజకీయ దుష్ట శక్తులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు రేకెత్తిస్తున్న వేళ యువతకు దీనిపై మరింత నమ్మకం కలిగించేలా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందే అగ్నివీరుల (Agniveers)కు రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు రక్షణ శాఖ శనివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

”తగిన అర్హత ఉన్న అగ్నివీరుల (Agniveers)కు రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రక్షణశాఖ మంత్రి రాజ్ ‌నాథ్‌ సింగ్ ఆమోదం తెలిపారు. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, డిఫెన్స్‌ సివిలియన్‌ పోస్ట్ ‌లతో పాటు 16 డిఫెన్స్‌ పబ్లిక్‌ సెక్టార్‌ విభాగాలకు ఈ రిజర్వేషన్‌ వర్తిస్తుంది. ప్రస్తుతమున్న ఎక్స్‌ సర్వీస్ ‌మెన్‌ కోటాతో పాటు ఈ రిజర్వేషన్ అమలవుతుంది. ఇందుకోసం నియామక నిబంధనల్లో తగిన సవరణలు చేయనున్నాం. వయో పరిమితి సడలింపు కూడా చేయనున్నాం” అని రక్షణశాఖ వెల్లడించింది.

అగ్నిపథ్‌ (Agnipath)పై నిరసనలు పెల్లుబికిన నేపథ్యంలో ఈ ఉదయం రాజ్ ‌నాథ్‌ సింగ్‌ ఈ పథకంపై సమీక్ష చేపట్టారు. త్రివిధ దళాల ఉన్నతాధికారులతో భేటీ అయ్యి చర్చించారు. ఈ సమావేశంలోనే రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF), అస్సాం రైఫిల్స్‌ (Assam Rifles) నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరుల (Agniveers)కు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యాలయం ప్రకటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.