
-
దేశ వ్యతిరేక శక్తుల ఉచ్చులో పడొద్దని యువతకు విశ్వహిందూ పరిషత్ హితబోధ
భాగ్యనగరం: అగ్నిపథ్ స్కీంకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై జరిగిన దాడి కలకలం రేపింది. ఈ విధ్వంసం వెనుక ఉగ్రవాద శక్తుల హస్తం ఉందని ఆరోపించింది విశ్వహిందూ పరిషత్.
కోట్లాది రూపాయల రైల్వే ఆస్తుల విధ్వంసాన్ని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే జీ.ఆర్.పి(గవర్నమెంట్ రైల్వే పోలీసు), రాష్ట్ర ఇంటలిజెన్స్ పూర్తిగా విఫలమైందని విమర్శించింది.
పలు రైళ్ళు రద్దయి లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వందల సంఖ్యలో ఉన్న ఆందోళన కారులను అక్కడి నుండి తరలించడంలో స్థానిక పోలీసు యంత్రాంగం ఇంకా ఎందుకు కాలయాపన చేసిందని ప్రశ్నించింది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు పరిశీలించి ఈ శుక్రవారం కూడా కొన్ని అసాంఘిక శక్తులు అల్లర్లు సృష్టించే ప్రమాదం ఉందని పోలీసులను ముందే హెచ్చరించినా తగిన చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారన్న వీహెచ్‌పీ నేతలు దుయ్యబట్టారు.
దేశ భక్తితో భారత సైన్యంలో చేరాలనుకునే యువత రైళ్ళుకు నిప్పు పెట్టారంటే నమ్మలేం. నిరుద్యోగ యువతను ముందుపెట్టుకాని తెరవెనుక అసాంఘిక శక్తులు తమ విద్రోహ ఎజెండా అమలు చేస్తున్నాయని వీహెచ్ పీ ఆరోపించింది. ముఖాలకు గుడ్డలు కట్టుకొని పోలీసులపై రాళ్ళ వర్షం కురిపిస్తూ రైల్వే ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన వీడియోలు చూస్తుంటే ఇది ఖచ్చితంగా సంఘ విద్రోహకర శక్తుల పనే అనే విషయం తెలుస్తుందని, ఈ విధ్వంసం వెనకాల రాజకీయ పార్టీల కుట్రలపై కూడా పలు ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.





