News

కురిచేడులో శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి ఆలయగోడ ధ్వంసం!

495views
  • ఆర్యవైశ్యుల రాస్తారోకో, ధ‌ర్నా, ఇక చూస్తూ ఉండబోమని హెచ్చరిక!

కురిచేడు: ప్ర‌కాశం జిల్లా, ఒంగోలు ద‌గ్గ‌ర‌ కురిచేడులోని ఆర్యవైశ్యుల ఇలవేలుపు శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి ఆలయ గోడ‌ను కొంత‌మంది ధ్వంసం చేశారు. దీంతో ఆర్యవైశ్యులు భ‌గ్గుమ‌న్నారు. ప‌ట్ట‌ణంలో రాస్తారోకో, ధ‌ర్నా చేశారు. టైర్ల‌కు నిప్పుపెట్టి గ‌ట్టిగా నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఆర్యవైశ్యులంటే అలుసా? నిరంకుశ రాష్ట్ర ప్రభుత్వం, వారి చోటా నాయకులు, వారి కనుసన్నలలో పనిచేసే ప్రభుత్వ అధికారులు పదే పదే ఆర్యవైశ్యులపై దాడులు, హత్యలు చేయడం, అభివృద్ధి పేరిట, ఆల‌యాల గోడ‌ల కూల్చుడం త‌గ‌ద‌ని మండిప‌డ్డారు.

ఇక నుంచి ఇటువంటి నీతిమాలిన చ‌ర్య‌ల‌పై ఉపేక్షించమని ఆర్యవైశ్య సంఘాలు గ‌ట్టిగా హెచ్చ‌రించాయి. బుధవారం కురిచేడులో నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైటాయించి మాకు న్యాయం కావాలి, ఆలయ గోడను ధ్వంసంచేసినవారు క్షమాపణ చెప్పాలని, వారే ఆ గోడను తిరిగి నిర్మించాల‌ని పెద్దఎత్తున నినాదాలు చేశారు. మండుటెండలో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు.

వాసవి యూత్, వాసవి మహిళలు, ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. కురిచేడులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయ ప్రహరిగోడను పగులగొట్టి బస్ షెల్టర్ నిర్మించడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నించారు. దీనిని స్థానిక ఆర్యవైశ్యులు అడ్డుకోగా ఆ పార్టీ నాయకులు దుర్భాషలాడుచూ గొడవచేశారు. వైసీపీ నాయకుల చర్యలను ఖండిస్తూ, మా అమ్మవారి దేవస్థానం ప్రహరిని వారే నిర్మించి ఇచ్చేదాక పోరాడుతామని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యులపై దాడులు పెరిగిపోతున్నాయ‌ని, ఇక చూస్తూ ఊరుకోమ‌ని శ‌ప‌థం చేశారు. ఈ చ‌ర్య‌ ఆలయంపై దాడి కాదని, దైవంపై దాడి… ఒక వర్గంపై దాడ‌ని అభివర్ణిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

90 ఏళ్ళ కింద‌ట‌…

బాలకోటయ్య, పిచ్చమ్మల పూర్వీకులు తొంబైయేళ్ళ కింద‌ట స్థలం, బావిని దేవాలయానికి ఇచ్చారు. ఆ బావి నీటిని ప్రజల ఉపయోగార్ధం కోసం నలభై ఏళ్ళ కింద‌ట తాత్కాలికంగా పంచాయ‌తీకి ఇచ్చారు. కాలక్రమేణా బావి ఉపయోగం తగ్గిపోయింది. ఇలా.. మూడు నెలలుగా బావి ఉపయోగంలో లేని కారణంగా ఆల‌య ర‌క్ష‌ణార్థం క‌మిటీ అక్క‌డ గోడ‌ను నిర్మించింది. ఈ గోడ‌నే వైసీపీ పార్టీవారు దౌర్జ‌న్యంగా ధ్వంసం చేశార‌ని ఆర్య‌వైశ్యులు ఆరోపిస్తున్నారు. గోడ ఎందుకు కూల్చివేశార‌ని ప్రశ్నించగా నానా మాటలు అన్నారు, తిట్టారని ఆర్య‌వైశ్యులు తెలిపారు.

దేవాలయం పక్కన పబ్లిక్ శౌచాలయం నిర్మించ‌డానికి కొంత‌మంది స్వార్థ‌ప‌రులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, ఆల‌యం ప‌క్క‌ట ఇటువంటి క‌ట్ట‌డం మ‌హా పాప‌మ‌ని బాధితులు అన్నారు. అంతేకాకుండా ఆల‌యం స్థ‌లం ఆక్ర‌మించి బ‌స్‌షెల్ట‌ర్ క‌ట్ట‌డానికి య‌త్నిస్తున్నార‌ని బాధితులు చెప్పారు. ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంద‌ని, వారు పాలకులైనా, ప్రజలైనా, అధికారులైనా… ఏది న్యాయ‌మో ఆలోచించాల‌ని, లేద‌ని ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తే చూస్తూ ఊరుకోమ‌ని దైవాన్ని కాపాడుకుంటామ‌ని ఆర్య‌వైశ్య‌లు హెచ్చ‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.