News

‘‘గీత కోణంలో సంఘ్ ప్రార్థన’’ పుస్తకాన్ని ఆవిష్కరించిన డా. కృష్ణగోపాల్

19views

డాక్టర్ మార్కండేయ అహుజా రచించిన, సురుచి ప్రకాశన్ ప్రచురించిన “సంఘ్ ప్రార్థన: గీతా కే పరిప్రేక్ష్య మే” (గీత కోణంలో సంఘ్ ప్రార్థన) పుస్తక అధికారిక ఆవిష్కరణ కార్యక్రమం న్యూఢిల్లీ జండేవాలాన్‌లోని కేశవ్ కుంజ్‌లో ఉన్న ‘విచార్ వినిమయ్న్యాస్’ ఆడిటోరియంలో జరిగింది.

ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ-సర్కార్యవాహ డాక్టర్ కృష్ణ గోపాల్ ముఖ్యఅతిథిగా హాజరై కీలకోపన్యాసం చేయగా, ప్రముఖ గీతా పండితులు, జియో (GEO) గీత వ్యవస్థాపకులు స్వామి జ్ఞానానంద్ మహారాజ్ ఆశీస్సులు అందించి, ఆధ్యాత్మిక అంతరార్థాలను వివరించారు.

సురుచి ప్రకాశన్ మేనేజింగ్ డైరెక్టర్ రజనీష్ జిందాల్ స్వాగత ఉపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. సాహితీ, మేధో రరంగాల్లో తమ సంస్థ అందిస్తున్న సుదీర్ఘ సేవలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా 150కి పైగా పుస్తక విక్రయ కేంద్రాలు, వివిధ ఆన్‌లైన్ వేదికల ద్వారా ప్రస్తుతం తమ ప్రచురణ సంస్థ 600కు పైగా వివిధ అంశాలపై పుస్తకాలను అందిస్తోందని ఆయన తెలిపారు.

సభను ఉద్దేశించి రచయిత డాక్టర్ మార్కండేయ అహుజా మాట్లాడుతూ, ఈ పుస్తకాన్ని రచించడానికి గల ప్రేరణ, లక్ష్యాలను వివరించారు. సంఘ్ ప్రార్థన అనేది కేవలం కొన్ని పదాల సమాహారం మాత్రమే కాదని, అది భారతదేశ నాగరికత దృక్పథానికి, జాతీయ చైతన్యానికి, కర్తవ్య నిష్టకు మరియు ఆధ్యాత్మిక విలువల వ్యక్తరూపమని ఆయన పేర్కొన్నారు. భగవద్గీత తాత్విక చట్రం ఆధారంగా సంఘ్ ప్రార్థనలోని లోతైన కోణాలను ఈ పుస్తకం పరిశీలిస్తుందని వివరించారు.

తన ప్రసంగంలో డాక్టర్ కృష్ణ గోపాల్ మాట్లాడుతూ.. భగవద్గీత నిరంతరం ప్రాముఖ్యతను కలిగి ఉందని, భారతదేశ మేధో, సాంస్కృతిక పరంపరను రూపుదిద్దడంలో అది కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. భగవద్గీత ప్రపంచానికి కర్తవ్యం, నిష్కామ కర్మ ప్రాతిపదికగా ఒక విశిష్టమైన తాత్విక దృక్పథాన్ని అందించిందన్నారు. ఈ పుస్తకం గురించి ప్రస్తావిస్తూ, నేటి సమయానికి అత్యంత అవసరమైన స్ఫూర్తిని రచయిత కొన్ని చక్కటి పంక్తులలో సమర్థవంతంగా అందించారని ప్రశంసించారు. శ్రీకృష్ణుడు అర్జునుని మోహాన్ని తొలగించి, తన కర్తవ్యాన్ని నిర్వహించేలా ఎలా ప్రేరేపించాడో.. అదేవిధంగా స్వయంసేవకులు స్పష్టత, దృఢ సంకల్పంతో తమ బాధ్యతలను స్వీకరించడానికి ఈ పుస్తకం స్ఫూర్తినిస్తుందని శ్రీకృష్ణ-అర్జునుల సంవాదంతో పోలుస్తూ చెప్పారు.

స్వామి శ్రీ జ్ఞానానంద్ మహారాజ్ మాట్లాడుతూ.. సంఘ్ ప్రార్థన యొక్క అంతస్సారం భగవద్గీత బోధనలతో సంపూర్ణంగా ఏకీభవిస్తుందని నొక్కి చెప్పారు. మేఘాలు సూర్యకాంతిని తాత్కాలికంగా మాత్రమే కప్పివేస్తాయి కానీ దాని తీవ్రతను తగ్గించలేవు; అలాగే మానవ మనస్సును కప్పివుంచే అజ్ఞానపు ముసుగును తొలగించడమే ఈ ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశమని వివరించారు. తన ప్రసంగ ముగింపులో, ఆయన సభలోని వారందరితో కలిసి ప్రార్థనను కలిపే పాడించారు.

సురుచి ప్రకాశన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంకుర్ పాఠక్ ధన్యవాద సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో సురుచి ప్రకాశన్ ఛైర్మన్ రాజీవ్ తులీ, ట్రస్టీలు మన్మోహన్ సింగ్, సుమిత్ మలూజా, రాహుల్ సింగ్ లతో పాటు విద్య, సాహిత్యం, ఆధ్యాత్మికత మరియు సామాజిక సేవా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భారతీయ ఆలోచనా విధానం యొక్క తాత్విక, సాంస్కృతిక పునాదులను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఒక ముఖ్యమైన సంపద అని హాజరైన ప్రముఖులు అభివర్ణించారు.