
బాల్కోట్ దాడి భారత-పాకిస్తాన్ మధ్య ఉన్న సైనిక సంక్షోభం విషయంలో ప్రపంచానికి ఇప్పటిదాకా భారత్ పై ఉన్న అభిప్రాయాన్ని మార్చేసింది.
1987 తరువాత నించి ఎదురైన ప్రతి సైనిక పరమైన సంక్షోభాన్నీ భారతదేశం చాలా ఆచి తూచి
ఎదుర్కొంటుంటే, పాకిస్తాన్ మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ప్రస్తుతం భారతదేశ ప్రతిస్పందన పాకిస్తాన్ విషయంలో ఉన్న“అణ్వాయుధం వాడినా, శిక్ష నుండి మినహాయింపు” అనే భ్రమను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అనే సంకేతాన్ని ఇస్తోంది.
మొదట్లో, అంటే, 1947-48, 1965 మరియు 1971 లో భారత్-పాక్ ల మధ్య సంప్రదాయ పద్ధతులలో యుద్ధాలు జరిగాయి. గడిచిన మూడు దశాబ్దాలలో – 1987, 1990, 1999, 2001-02 మరియు 2008 లో వరుసగా సైనిక సంక్షోభాలు ఏర్పడ్డాయి. అప్పుడు ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం వచ్చే పరిస్థితులు నెలకొన్నప్పటికీ, అలా జరగలేదు.
2019 ఫిబ్రవరి 14న కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ కి చెందిన నలభై మంది జవాన్లను చంపడం మరొక క్రొత్త సైనిక సంక్షోభానికి దారి తీసింది. ఈ సారి మాత్రం ఢిల్లీ లో ఉన్న ప్రభుత్వం, ఇంతకు ముందు జరిగినదానికి భిన్నంగా స్పందించింది. భారతీయ వాయుసేన విమానాలు బాల్కోట్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద బాంబులు విడిచి, 1971 తరువాత మొదటిసారి పాకిస్తాన్ వాయుసేన తో నేరుగా తలపడ్డాయి.
1987 లో అలాగే 2019 లో భారత-పాకిస్తాన్ సైనిక ఘర్షణలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. 1987 లో పాకిస్తాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోవడం ప్రభావాన్ని చూపిస్తే, పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉన్నాయనడం కేవలం బుకాయింపు అని భారత్ అనడం ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి.
ముందుగా అణ్వాయుధాల విషయానికి వస్తే, 1974 మే లో భారత్ “శాంతియుత అణ్వాయుధ పరీక్ష” పేరిట జరిపిన ప్రయోగానికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ వాటిని సమకూర్చుకోవడం మొదలుపెట్టింది అని కొంతమంది అభిప్రాయం. భారత దేశం తనని తాను మోసం చేసుకోవడానికి “శాంతియుత అణ్వాయుధ పరీక్ష” అని పేరు పెడితే, పాకిస్తాన్ అప్పటికే అణ్వాయుధాలను సమకూర్చుకునే ప్రయత్నం లో ఉంది. పాకిస్తాన్ అణ్వాయుధ కార్యక్రమానికి బీజాలు 1971 లో తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్ గా అవతరించిన యుద్ధ సమయం లో పడ్డాయని చెప్పచ్చు. ఆ సమయంలో పాకిస్తాన్ కి మిత్ర దేశాలైన అమెరికా, చైనా లు రెండూ భారత సైన్యం పాకిస్తాన్ ని ముక్కలు చేయడాన్ని ఆపే ప్రయత్నం చేయకపోవడం ఆ దేశానికి ఊహించని పరిణామం.

కొంత భూభాగాన్ని కోల్పోయిన పాకిస్తాన్ యొక్క పగ్గాలను 1972 లో చేపట్టిన జుల్ఫీకర్ అలీ భుట్టో
ముందున్న ప్రధాన కర్తవ్యం పాకిస్తాన్ యొక్క అణ్వాయుధ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం. 1977 లో భుట్టోను పదవీచ్యుతుడ్ని చేసి అధికారం చేపట్టిన జనరల్ జియా ఉల్ హక్ ఈ ప్రయత్నాన్ని తీవ్రతరం చేసి 1987 నాటికి పాకిస్తాన్ అణ్వాయుధాన్ని సమకూర్చుకోగలిగిందని గర్వముగా ప్రకటించాడు. 1980 దశకం చివరి నాటికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ భారత దేశానికి అణ్వాయుధాలను సమకూర్చడం మొదలుపెట్టాడు. అణ్వాయుధ యుద్ధం వస్తుందేమో అన్న భయం భారత్,పాకిస్తాన్ లు ఘర్షణ వాతావరణాన్ని తగ్గించుకుని, వాటి మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను బాధ్యతాయుతంగా నిర్వహించుకునేలా చేస్తుందని ఆశావహులు భావించారు. కానీ పాకిస్తాన్ సైన్యం మరోలా ఆలోచించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత్ తో తక్కువ తీవ్రత కలిగిన యుద్ధాన్ని కొనసాగించవచ్చని అది భావించింది.
తమ దగ్గర ఉన్న అణ్వాయుధ పాటవం పెద్ద ఎత్తున సంప్రదాయ సైన్యాన్ని కలిగియున్న భారతదేశ సైనిక సత్తాను తటస్థీకరించి, భారత్ ని పదే పదే గాయపరచడానికి తమకి స్వేచ్ఛ ఇచ్చిందని పాకిస్తాన్ సైన్యం భావించింది. జైషే ఏ మహమ్మద్, లష్కర్ ఏ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల ద్వారా పాకిస్తాన్ భారత దేశ పౌరులను, సైన్యాన్ని చంపుతున్నప్పటికీ, ఆ దేశం దగ్గరున్న అణ్వాయుధం అనే అంశం మనల్ని తగిన రీతిలో బుద్ధి చెప్పనీయకండా వెనక్కి లాగింది.
అణ్వాయుధ వ్యాప్తి జరుగుతుందేమో అనే భయంతో భారత దేశం సైనిక సన్నాహానికన్నా వ్యూహాత్మక మౌనం మంచిదనే సిద్ధాంతాన్ని అనుసరించింది. కాశ్మీర్ లో ఉన్న అధీన రేఖ అత్యంత పవిత్రమైనదని, దానిని ఎట్టి పరిస్థితుల్లో అధిగమించకూడదనేది ఈ సిద్ధాంతం లోని ముఖ్యమైన ప్రతిపాదన.


పరిమిత స్థాయిలో పాకిస్తాన్ తో యుద్ధం చేయాల్సివచ్చినప్పుడు – ఉదాహరణకి 1999 వేసవి లో కార్గిల్ ప్రాంతంలోకి చొచ్చుకువచ్చిన పాక్ సైన్యాన్ని తిప్పి పంపాల్సి వచ్చినప్పుడు – కూడా భారత దేశం తన సైన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాస్తవాధీన రేఖను దాటొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 2001-2002 లో దేశ పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు కూడా ఇదేరకంగా జరిగింది.
పై రెండు సందర్భాలలోనూ వాజపేయి ప్రభుత్వం పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడానికి పూర్తి స్థాయిలో సైనిక సన్నద్ధతను ఆదేశిస్తే, తరువాత దశాబ్దం పాటు కొనసాగిన మన్మోహన్ ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ మీద సైనిక చర్య సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కానీ, పాకిస్తాన్ తో ఉన్న తగువును పరిష్కరించడంలో కానీ ఎటువంటి రాజకీయ లబ్దిని చేకూర్చదని అభిప్రాయపడింది. 2008 నవంబరు నెల చివరలో ముంబాయి లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు కూడా భారత్ సైనికపరమైన చర్యలు తీసుకోవడానికి నిరాకరించింది.
భారత దేశం అణ్వాయుధాల విషయంలో సంయమనంతో కూడిన బాధ్యతాయుతమైన దారిని ఎంచుకుని, వాస్తవాధీన రేఖను అతిక్రమించకూడదు అనే నియమానికి కట్టుబడి ఉండగా, పాకిస్తాన్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తోంది. అణు యుద్ధం వస్తుందేమో అన్న భయంతో ప్రపంచ దేశాలు కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కి అనుకూలంగా ఉండమని భారత్ ని ఒత్తిడి చేస్తాయని పాకిస్తాన్ ఆశించింది.
ప్రధాని నరేంద్ర మోడీ, అయన రక్షణ సలహాదారు అజిత్ దోవల్ మాత్రం పాకిస్తాన్ అణు బూచిని విస్మరించి, ఆ దేశం చేస్తున్న ఉగ్ర దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టచ్చు అనే కొత్త సిద్ధాంతాన్ని తెరమీదకి తెచ్చారు. అలాగే వారిద్దరూ వాస్తవాధీన రేఖకు ఒక రకమైన పవిత్రత ఉన్నదనే నమ్మకాన్ని తిరస్కరించారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం సహకరిస్తోంది కాబట్టి, ఆ దేశం వాస్తవాధీన రేఖను ఏ మాత్రం పవిత్రంగా భావించడంలేదని వారు తేల్చి చెప్పారు.

మోడీ నాయకత్వంలో భారత దేశం “దూకుడుతో కూడిన రక్షణ” అనే వ్యూహాన్ని అనుసరిస్తోంది. నిరంతరాయంగా జరుగుతున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల చొరబాట్లపై సైనిక స్పందనను తీవ్రతరం చేసి, వాస్తవాధీన రేఖ అవతల విస్తృతంగా సైనిక చర్యలను చేబట్టాలని భారత్ నిర్ణయించుకుంది. 2016 సెప్టెంబర్ మొదట్లో యూరి లోని ఆర్మీ బ్రిగేడ్ కేంద్ర కార్యాలయం పై జరిగిన ఉగ్ర దాడికి ప్రతీకారంగా వాస్తవాధీన రేఖకు ఆవల “సర్జికల్ స్ట్రైక్స్” ని చేపట్టింది.
ఫిబ్రవరి 26 వేకువజామున బాల్కోట్ లోని ఉగ్రవాద స్థావరాల పై జరిపిన వాయుసేన దాడి, మరుసటి రోజు పాక్ వాయుసేన మీద జరిగిన దాడులను పాకిస్తాన్ యొక్క “అణ్వాయుధం వాడినా శిక్ష నుండి మినహాయింపు”ని ఎదుర్కునే వ్యూహంలో భాగంగా భావించాలి. మోడీ యొక్క ఈ వ్యూహం దక్షిణాసియా ప్రాంతం లోని రెండు శత్రు దేశాల మధ్య అణ్వాయుధ దాడి ప్రమాదాన్ని పెంచుతుందేమో అని చాలా మంది భయపడ్డారు.
మోడీ మరియు ఆయన సలహాదారులు మాత్రం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అసాధ్యం అని ఎప్పటికీ ఊరుకోవడంకన్నా , పాకిస్తాన్ అణు పాటవం ఏ పాటిదో తెలుసుకోవడానికి ప్రయత్నించడం మంచిదని వాదించవచ్చు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలలాగా మోడీ ప్రభుత్వం కాశ్మీర్ లో సైనిక చర్యను పెంచితే అంతర్జాతీయ జోక్యం, మధ్యవర్తిత్వం అనే అంశాలు తెరమీదకు వస్తాయేమో అని భయపడటం లేదు.
అంతే కాదు మోడీ మరియు ఆయన సలహాదారులు ఈ విషయంలో వచ్చే అంతర్జాతీయ ప్రతిస్పందనను చాలా సులభంగా ఎదుర్కోవచ్చు అనే విశ్వాసముతో ఉన్నారు. పెరిగిన సైనిక చర్య విషయంలో ప్రపంచ దేశాల ఆందోళనను, ఉగ్రవాదులకు మద్దతు ఉపసంహరించమని పాకిస్తాన్ మీద ఒత్తిడి తెచ్చేలా మళ్లించవచ్చని భారత్ నమ్ముతున్నట్టుగా కనిపిస్తోంది.

బాల్కోట్ దాడుల తరువాత చైనా తప్ప మరే దేశమూ పాకిస్తాన్ కి మద్దతు పలకకపోవడం గడిచిన మూడు దశాబ్దాలలో భారత్, పాకిస్తాన్ ల యొక్క భౌగోళిక, రాజకీయ సంబంధాలలో చోటు చేసుకుంటున్న మార్పులను సూచిస్తోంది.
అణ్వాయుధాలు మరియు జీహాదీ తీవ్రవాదం కు స్థావరంగా మారిన పాకిస్తాన్ ఆర్ధిక రంగంలో భారత్ తో పోటీ పడే అంశాన్ని పూర్తిగా విస్మరించింది. దాదాపు మూడు ట్రిలియన్ డాలర్లతో భారత దేశ స్థూల జాతీయోత్పత్తి 300 బిలియన్ డాలర్లు గా ఉన్న పాకిస్తాన్ యొక్క స్థూల జాతీయోత్పత్తి కన్నా పది రేట్లు అధికంగా ఉంది. ఇంకో విచిత్రమైన విషయం, భారత్ తో వ్యూహాత్మక సమానత్వాన్ని తీవ్రంగా కోరుతున్న పాకిస్తాన్ ఆర్ధిక, సామాజిక అభివృద్ధి విషయంలో బంగ్లాదేశ్ కన్నా వెనుకపడటం మొదలుపెట్టింది.
1980 చివరి దశలో సైనిక సమతుల్యత విషయంలో అణు పాటవం పాకిస్తాన్ కి అనుకూలంగా మారింది. అయితే స్థిరంగా, నిరంతరాయంగా కొనసాగుతున్న పాకిస్తాన్ యొక్క పతనం 21 దశాబ్దం లో భారత్ పైచేయి సాధించేవిధంగా పరిణమించింది. కానీ ఈ పరిస్థితి భారత్, పాకిస్తాన్ మీద నిరంతరాయంగా యుద్ధం చేయడానికి తోడ్పడకపోవచ్చు. అలాగే పాకిస్తాన్ తన మూడు దశాబ్దాల విధానాలను మార్చుకోవడం అంత సులభం కాదు.

ప్రస్తుతం ఉన్న, భవిషత్తులో రాబోతున్న సంక్షోభాలు ఎలా ముగుస్తాయో ఇప్పుడు మనం ఊహించలేము. కానీ బాల్కోట్ దాడి మాత్రం భారత్-పాక్ ల మధ్య సైనిక సంక్షోభాల విషయంలో ఇప్పటిదాకా ఉన్న పరిస్థితిని ఖచ్చితంగా మార్చిందని చెప్పవచ్చు.
Written by : C. Raja Mohan ( This article first appeared in the print edition on March 4 under the title ‘India – Pakistan tensions : How a pattern ended’. The writer is Director, Institute of South Asian Studies, National University of Singapore and contributing editor on international affairs for The Indian Express.
Translated By : Seshasai Deevi.





