News

కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి

543views

• కోనసీమ ప్రజలకు సామాజిక సమరసతా వేదిక విజ్ఞప్తి

కోనసీమ జిల్లా ప్రజలు సంయమనం పాటించాలని సామాజిక సమరసతా వేదిక, ఆంధ్ర ప్రదేశ్ విజ్ఞప్తి చేస్తోంది. అంబేద్కర్ కేవలం ఏ ప్రాంతానికో, భాషకో, కులానికో, ప్రాంతానికో పరిమితమైన నాయకుడు కాదని ఆయన జాతీయ నాయకుడని, ఆయన పేరును కోనసీమ జిల్లాకు పెట్టడాన్ని అనవసరంగా వివాదాస్పదం చేయడం తగదని సమరసతా వేదిక వివరిస్తోంది.

మన ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరును ఒంగోలు జిల్లాకు, నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గా, కడప జిల్లాకు శ్రీ వై.ఎస్.ఆర్ కడప జిల్లాగా గత ప్రభుత్వాలు పేర్లు పెట్టాయని, తాజాగా శ్రీ అన్నమయ్య, అల్లూరి, ఎన్టీ.ఆర్ పేర్లను ఆయా జిల్లాలకు పెట్టారని సామాజిక సమరసతా వేదిక గుర్తు చేసింది.

రాజకీయ విమర్శ, ప్రతి విమర్శలకు ఇది సమయం కాదని, అందరం కలిసి కోనసీమలోని అశాంతిని చల్లార్చవలసి ఉందని, కోనసీమ జిల్లాకు “డా. అంబేడ్కర్ కోనసీమ” జిల్లాగా పేరు పెట్టడంపై అందరూ ఏకాభిప్రాయానికి రావాల్సిందిగా సామాజిక సమరసతా వేదిక ఒక ప్రతిపాదనను ప్రజల ముందుంచుతున్నదని సామాజిక సమరసతా వేదిక జాతీయ కన్వీనర్ శ్రీ కే. శ్యామ్ ప్రసాద్, సామాజిక సమరసతా వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కే.మన్మధరావులు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.