ArticlesNews

మన మీడియా నిజాన్ని నిర్భయంగా వెల్లడించేదెన్నడు?

111views

ప్రణయ్, అమృత ఈ పేర్లు తెలియని వారు బహుశా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎవ్వరూ ఉండరేమో? దళిత (నిజానికి అతని కుటుంబం ఎప్పుడో క్రైస్తవం స్వీకరించింది) యువకుడైన ప్రణయ్ తనకు ఇష్టం లేకుండా తన కుమార్తె అమృతను వివాహం చేసుకున్నాడన్న అక్కసుతో అమృత తండ్రి మారుతిరావు ప్రణయ్ ను హత్య చేయించాడు. ఒక మనిషిని చంపడం ఎవరు చేసినా అది తప్పే. ఎవరైనా దానిని గర్హించి తీరవలసిందే. అలాగే అందరూ ప్రణయ్ హత్యను ఖండించారు కూడా.

మీడియా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ లేవదీసింది. దళిత సంఘాలు, అభ్యుదయవాదులు, మహిళా హక్కుల సంఘాలు, హేతువాద సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో రోజుల తరబడి చర్చలు నిర్వహించింది. మృతుడి భార్య అమృతను చానళ్ళ వాళ్ళు పోటీలు పడి ఇంటర్వ్యూలు చేశారు. భర్త పోయిన బాధలోనో ఏమో ఆ అమ్మాయి తన తల్లిదండ్రుల పైన, దాంపత్యం పైన చేసిన కొన్ని అవగాహన రహిత, అపరిపక్వ వ్యాఖ్యలను సైతం నిస్సిగ్గుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది మీడియా. అమృత చేసిన ఆ వ్యాఖ్యలతో అప్పటివరకూ అమృతపై సానుభూతిని చూపించిన వ్యక్తులే ఆమె పట్ల వ్యతిరేక అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారు. తానేం మాట్లాడుతున్నానో తనకే అర్థం గాని, అర్థం చేసుకోలేని వయసు, అయోమయ పరిస్థితి ఆ అమ్మాయిది. దాంతో అనవసరంగా వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఆమె చేసిన ఆ అపరిపక్వ వ్యాఖ్యల కారణంగా సోషల్ మీడియా వేదికగా ఆమెపై అనేకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కూడా.

తాజాగా ఈ మధ్య హైదరాబాద్ సరూర్ నగర్ లో ఇదే తరహాలో బిల్లాపురం నాగరాజు అనే ఓ దళిత యువకుడి హత్య జరిగింది. తను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవడమే అతను చేసిన నేరం. ప్రణయ్, అమృతల విషయంలో అంత అతి చేసిన మీడియా విచిత్రంగా ఇప్పుడు మాత్రం దీనిని ఓ సాధారణ వార్తగా ప్రసారం చేసి చేతులు దులుపుకుంది. మీడియాలో సంచలన వార్తగా ఇది ప్రసారం కాలేదు. ఎలాంటి డిబేట్ లు లేవు. దళిత హక్కుల సంఘాలు, మేధావులు, మహిళా సంఘాలు, మానవతావాదులు, హేతువాద సంఘాలు, అభ్యుదయ వాద రచయితలు, ఎస్ టి ఎస్ సీ బీ సీ మైనారిటీ సంఘాలు ఏవీ తెర ముందుకు రాలేదు. కనీసం అయ్యో పాపం అనైనా అనలేదు. భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ నవ వధువు దగ్గరకు ఏ మీడియా వాళ్ళూ మైకులు, కెమెరాలూ పట్టుకెళ్ళలేదు. ఆమె దుఖాన్ని లోకానికి వెల్లడించే ప్రయత్నం చెయ్యలేదు. కారణం నాగరాజు వివాహం చేసుకున్న యువతి పేరు సయ్యద్ అశ్రీన్ సుల్తానా. చంపిన వాళ్ళ పేర్లు సయ్యద్ మొబిన్ అహ్మద్, మొహమ్మద్ మసూద్ అహ్మద్. అద్గదీ సంగతి. ఆ పేర్లు చూడడం తోటే మీడియా మొత్తం మెత్తబడి పోయింది. మేథావులు, సినీ నటులు, మీటూ సంఘాలు, దళిత సంఘాలు వగైరా వగైరాల నోళ్ళన్నీ మూతబడిపోయాయ్. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా కిక్కురుమనకుండా మూలన పడి ఉన్నాయ్. ఎక్కడో ఉత్తరప్రదేశ్లోనో, గుజరాత్ లోనో ఏదో జరిగితే… దానిని గోరంతలు కొండంతలు చేసి చూపించి, విచిత్ర, వికృత విశ్లేషణలు చేసి జనాల మెదళ్లను మలినం చేసే మన తెలుగు మీడియా అకస్మాత్తుగా తెగులు పడ్డ కోడిలా కిమ్మనకుండా కూర్చుండిపోయింది.

ప్రధాన స్రవంతి మీడియా యొక్క ఈ తరహా పక్షపాత ధోరణిని, పాత్రికేయ విలువలకు తిలోదకాలిచ్చి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును సోషల్ మీడియాలో అనేకులు ఎప్పట్నుంచో ఏకిపారేస్తున్నారు. మీడియా ద్వంద్వ ప్రమాణాలపై శరపరంపరగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అయినా సరే ఇవేవీ మీడియాకు వినపడవు, కనపడవు. మొత్తానికి పదేపదే నిర్ధారణ అవుతున్న విషయం ఏమిటంటే…. మీడియా, ముఖ్యంగా మన తెలుగు మీడియా తను వినాలనుకున్నదే వింటుంది, చూడాలనుకున్నదే చూస్తుంది, చెప్పాలనుకున్నదే చెబుతుంది. మనం వినకపోయినా సరే…. చెవిలో జోరీగలా వాగుతూనే ఉంటుంది. నిజా నిజాలతో పనిలేదు. తాము చెప్పాలనుకున్నది, చెబుతున్నది అబద్ధమని తమకు తెలియక కాదు. అయినా సరే మన ఆలోచనలను, అభిప్రాయాలను వక్ర మార్గం పట్టించడానికి, మనకు తెలియకుండానే మానను తమ దారిలోకి తెచ్చుకోవడానికి వాళ్లు నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు, ఉంటారు కూడా. ఎందుకంటే అందులోని లాభనష్టాల లెక్కలు వారికి మాత్రమే తెలుసు. నిజం చెబితే ఏం మిగులుతుంది? నిష్టూరం తప్ప అని వాళ్లకు గట్టి నమ్మకం.

కానీ వాళ్లు తెలుసుకోవాల్సిన అసలు నిజం ఒకటుంది. అదేమిటంటే జనం వారి మాటలు నమ్మడం ఎప్పుడో మానేశారు. ఏ మీడియా చానళ్ళ వారు ఎవరెవరికి అమ్ముడు పోయారో, వారు ఎలాంటి వార్తలను ప్రసారం చేస్తారో, ఎలాంటి విశ్లేషణలను ఇస్తారో, డిబేట్ లకు వచ్చిన వారిలో, ఎవరితో ఎలా వ్యవహరిస్తారో అన్నీ ప్రజలకు స్పష్టంగా తెలుసు. వారెన్ని వేషాలు వేసినా అవి వారికి స్వీయ ఆనందాన్ని ఇవ్వాల్సిందే తప్ప, జనం వారి కల్లబొల్లి కబుర్లకు భోల్తా పడిపోతారని ఇంకా నమ్మడం మీడియా వారి అవివేకానికి నిదర్శనం.

మీడియా తీరుతో విసిగిపోయిన జనం ఇప్పటికే మీడియాను ఛీ కొడుతున్నారు. హీరో విశ్వక్సేన్ సంఘటనే అందుకు నిదర్శనం. హీరో విశ్వక్సేన్ తో మీడియా వ్యవహరించిన తీరుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. ఒక్కరంటే ఒక్కరు కూడా మీడియాకు మద్దతు ఇవ్వలేదు. ప్రజలు పూర్తిగా మీడియాను ఛీకొట్టక ముందే, స్టూడియోలపై రాళ్లు రువ్వి తమ ఆగ్రహాన్ని, అక్కసును చల్లార్చుకోకముందే, మీడియా ప్రతినిధులను వీధుల్లో తరిమి తరిమి కొట్టక ముందే మీడియా కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా ప్రజలకు నిజా నిజాలను నిర్భయంగా వెల్లడించే ప్రయత్నం చేసి తమ నిజాయితీని, నిబద్ధతను చాటుకోవాలి. లేకపోతే భవిష్యత్ పరిణామాలను ఎదుర్కోవడానికి మీడియా సిద్ధంగా ఉండాలి.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.