ArticlesNews

భక్తి ద్వారానే సామాజిక సద్భావన, సమరసత

64views

“యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత…..” అని గీతలో పరమాత్ముడు చెప్పినట్లుగా ఈ భూమిపైన ధర్మానికి గ్లాని ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ ఒక మహాపురుషుడు ఉద్భవించి జాతికి జ్ఞానోపదేశం చేశారు. ఎందరో పుణ్యపురుషులు, ఋషులు, మునులు, వీరులు, పతివ్రతా మూర్తులు, భక్తాగ్రేసరులు జన్మించిన పుణ్యభూమి మన భారతదేశం.

జాతిలో భౌతికవాదం, మూఢత్వం ప్రబలి అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న ప్రతిసారీ ఆ అజ్ఞానాంధకారాన్ని తొలగించి జాతిలో చేతన నింపడానికి ఈ దేశంలో ఒక మహాపురుషుడుద్భవించాడు. అలాంటి మహానుభావులు, భగవత్స్వరూపులు ముగ్గురు అవతరించిన పుణ్య తిథి ఈరోజు.

ఆదిశంకరాచార్యులు :

వేద వేదాంగాలు అభ్యసించిన గొప్ప పండితుడు, యోగి, సన్యాసి, శాస్త్ర చర్చలలో హేమాహేమీలనే ఖంగు తినిపించిన మేధావి. కాశీలోని గంగానదిలో స్నానం చేసి తిరిగి వస్తున్నాడు. ఎదురుగా ఒక ఛండాలుడు, మురికి బట్టలతో ఉన్నవాడు 4 కుక్కలని పట్టుకుని ఎదురొస్తున్నాడు. శిష్యులు “స్వామివారొస్తున్నారు, పక్కకి తప్పుకో”మన్నారు. అయినా వినిపించుకోకుండా ముందుకు వస్తూ ఉంటే సాక్షాత్తూ స్వామి వారే అడ్డు తొలగమని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ ఛండాలుడు ” మీరు అడ్డు తొలగమంటున్నది నా దేహాన్నా? నాలోని పరమాత్మనా?” అని ప్రశ్నించాడు. సాక్షాత్తూ పరమశివుడే తన ఎదుట ఉన్నాడని, తనకు జ్ఞానోదయం కలిగించడానికే ఛండాలుని రూపంలో విచ్చేశాడని గ్రహించిన శంకరులు ఛండాలుని రూపంలోని ఆ పరమశివుని స్తుతిస్తూ ఐదు శ్లోకాలతో కూడిన మనీషా పంచకాన్ని పఠించారు. ప్రతి జీవిలోనూ పరమాత్ముడున్నాడని, సాధన ద్వారా ఎవరైనా ఉన్నతత్వాన్ని, ఉత్తమ గతులను పొందవచ్చని, ప్రతి జీవీ ఆ పరమాత్ముని స్వరూపమేనని చెబుతూ ఆదిశంకరులు అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. “ బ్రహ్మ సత్యం జగన్మిధ్యా, జీవో బ్రహ్మైవ నా పరః” అంటే బ్రహ్మమొక్కటే సత్యమైనది. జగత్తు అసత్యమైనది, అశాశ్వతమైనది. జీవుడే బ్రహ్మ.” అనే తత్వాన్ని బోధించారు.

కేరళ ప్రాంతంలో పూర్ణా నది తీరాన ఉన్న కాలడి అనే గ్రామంలో జన్మించిన మహా పురుషుడు శ్రీ శంకరాచార్యులు. ఛాందస భావనలతో, అజ్ఞానాంధ విశ్వాసములతో మగ్గుతున్న ప్రజల జీవనంలో పరివర్తన తీసుకురావడానికి ఎనిమిదేళ్ల ప్రాయంలో సన్యాస దీక్షను స్వీకరించి గోవింద భగవత్పాదుల వద్ద యోగ విద్యను అభ్యసించారు.

దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలనే భేదాలను తొలగించి జాతీయ సమైక్యతా సూత్రాన్ని చాటుతూ బదరీ, ద్వారక, పూరి, శృంగేరీలలో నాలుగు పీఠాలను స్థాపించారు. ఉపనిషత్తులకు ప్రామాణిక భాష్యాన్ని వ్రాశారు. సర్వ వేదాంత సంగ్రహము, వివేక చూడామణి, ప్రబోధ సుధాకరము వంటి అనేక రచనలు చేశారు.
దేశమంతా అర్ధరహితమైన ఆచార వ్యవహారాల్లో కొట్టుమిట్టాడుతూ, వివిధ శాస్త్రాలు, సిద్ధాంత రాద్ధాంతాలతో ప్రజలందరూ సంఘర్షించుకుంటూ, నైరాశ్యంలో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు ప్రజలలో సమరసతా భావనను, జాతీయ సమైక్యతను రగుల్కొల్పి దేశాన్ని రక్షించిన మహా తపస్వి శ్రీ ఆదిశంకరులు. సాక్షాత్తూ ఆ పరమ శివుడే శంకరునిగా అవతరించాడని నేటికీ భక్తులు భావిస్తారు. తన 32వ ఏట పరమపదం చేరారు ఆ ఆది శంకరులు.

భగవద్రామానుజాచార్యులు :

“న జాతిః కారణం లోకే గుణే కళ్యాణ కారకః” “నీ పుట్టుక కారణంగా, నీ కులం కారణంగా లోకానికి ఏ ప్రయోజనమూ చేకూరదు. నీ గుణగణాల కారణంగానే లోక కళ్యాణం సాధ్యమవుతుంది.” అని స్పష్టంగా బోధించిన మహా పురుషుడు శ్రీ రామానుజాచార్యులు.

“భక్తుడు భగవంతుని దాసుడైతే…. భగవంతుడు భక్తుని దాసుడు. కనుక సంపూర్ణ విశ్వాసంతో ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తే సాక్షాత్తు ఆ భగవంతుడే నీ ప్రభుడై, దాసుడై, స్నేహితుడై, ప్రేమికుడై నీ చెంతకు వస్తాడు” అంటూ విశిష్టాద్వైతాన్ని ప్రబోధించినవారు భగవద్రామానుజులు.

ఎవరికీ చెప్పొద్దని, అలా చెబితే నువ్వు నరకానికి వెళతావని హెచ్చరించి తన గురువు తనకు ఉపదేశించిన అష్టాక్షరీ మంత్రాన్ని గుడి గోపురమెక్కి అందరికీ వినిపించిన మానవతా మూర్తి రామానుజాచార్యులు.

నదీ స్నానం నుంచి తిరిగి వచ్చేటప్పుడు నిమ్న కులస్థుల భుజాలపై చేతులు వేసుకుని రావడం ద్వారా సమరసతను చాటిన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు. అంతేకాదు అదేమని ప్రశ్నించిన కొందరు శిష్యులతో ఆ విధంగా రావడం ద్వారా తాను మరింత పవిత్రుడనైనానని చెప్పేవారు. ఆ రోజుల్లో అస్పృశ్యులుగా పరిగణింపబడుతూ ఉండిన ఉపేక్షిత బంధువులను ఆయన “తిరుకులత్తార్” (పవిత్రమైన కులము వారు) అని సంబోధించే వారు.

వైష్ణవ భక్తాగ్రేసరులైన 12 మంది ఆళ్వారుల విరచితమైన పాశురాల సంకలనమైన దివ్య ప్రబంధాన్ని రామానుజులు పరమ ప్రామాణికంగా తీసుకున్నారు. శ్రీరంగంలోని రంగనాయక స్వామి ఆలయ మెట్లపై తన్మయత్వంతో విష్ణు కీర్తనను గానం చేస్తున్న తిరుప్పాన్ ఆళ్వారును స్వామివారి అభిషేకానికి నీళ్లు తీసుకు వెళుతున్న లోక సారంగుడు అనే అర్చకుడు రాయి విసిరి గాయపరచినపుడు గర్భగుడిలోని రంగనాథుని విగ్రహం నుంచి రక్తం స్రవించడం, ఆ ఆళ్వారును భుజాలమీద మోసుకుంటూ తన సన్నిధికి తీసుకురావాల్సిందిగా సాక్షాత్తూ ఆ రంగనాథుడే లోకసారంగుని ఆజ్ఞాపించిన వృత్తాంతాన్ని రామానుజులు పదే పదే తన భక్తులకు వివరిస్తూ ఉండేవారు. దీనిని బట్టి సామాజిక సమరసతకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం ఎంతటిదో మనకు అవగతమవుతుంది. అంతేకాదు కర్ణాటకలోని కావేరీ నది ఒడ్డున గల మేల్కొటే తిరునారాయణ మందిరంలోకి దళితులను స్వయంగా తోడ్కొని వెళ్లారు శ్రీ రామానుజులు.

కుల వర్ణ భేదాలకు అతీతంగా భక్తులందరూ ఆనంద పారవశ్యంతో చేసే హరినామ స్మరణ, చెక్క భజనలు, కోలాటం తదితరాలు రామానుజుల వల్లనే ప్రాచుర్యంలోకి వచ్చాయి. అణగారిన వర్గాలలో వైష్ణవ మత ప్రచారం కోసం మాల, మాదిగ దాసరులను తయారుచేసి వారిని ధర్మ ప్రచారకులుగా, ప్రసారకులుగా తీర్చిదిద్దిన ఘనత శ్రీరామానుజులది. మాల, మాదిగ దాసరుల భక్తి ప్రపత్తులు, త్యాగము, శౌర్య పరాక్రమాలు అనేక కావ్యాలలో ప్రస్తుతింపబడ్డాయి కూడా.

హైందవ సమాజంలో సమత, సమరసతా సాధనకై శ్రీ రామానుజుల కృషి అనన్య సామాన్యమైనది. హైందవ ధర్మో ద్ధరణకు, హైందవ సమాజంలో నెలకొన్న అంతరాలను అంతరింపజేయడానికి అహరహమూ తపించిన యతిరాజు భగవద్రామానుజులు తన 120 ఏట కైవల్యాన్ని పొందారు.

సంత్ సూరదాస్ :

16వ శతాబ్దంలో భక్తి యుగ కాలంలో జీవించిన సంత్ సూరదాసు శ్రీకృష్ణుని బాల్య క్రీడలను, ప్రేమ లీలలను, భక్తి తత్వంతో పరవశించి వర్ణిస్తూ గానం చేసేవాడు. అంథుడైన ఈయన ఆ స్వామిని మనోనేత్రంతో దర్శించి బృందావనంలో కూర్చుని ప్రతిరోజూ ఒక నూతన భజన గీతాన్ని ఆలపించేవాడు. “నర్ అపనీ కరనీకరే నరసీ నారాయణ హోయ్” అంటే “తన కర్తవ్యాన్ని నిర్వహించిన మానవుడు మాధవుడవుతాడు” అంటూ మానవజాతికి కర్తవ్యోపదేశం చేశాడు సూరదాసు. భక్తికి, భగవత్సాక్షాత్కారానికి వైకల్యం అడ్డుకాదని నిరూపించాడు.

ముగింపు :

జీవుల మధ్య అంతరాలకు తావు లేదని ఎవరూ అధికులు కానీ, అధములు కానీ కాదని, చరాచర సృష్టిలోని సకల జీవరాశి ఆ పరమాత్మ స్వరూపమని చాటిన వారు ఒకరైతే, భగవద్భక్తికి, కృపకు, సాక్షాత్కారానికి భక్తి ఒక్కటే మార్గమని, భక్తులెవరైనా భగవంతుని దృష్టిలో సమానులేనని, భగవత్ కృపకు అర్హులేనని, జన్మతో, జాతితో ఎవరూ గొప్పవారు కాదని చాటిన వారు మరొకరు. భక్తికి, తాత్విక చింతనకు, పాండిత్యానికి వైకల్యం అడ్డుకాదని, మనోనేత్రంతో భగవంతుణ్ణి దర్శించవచ్చని చాటిన వారు ఇంకొకరు.

భక్తి ద్వారానే సామాజిక సద్భావన, సమరసత సాధ్యమవుతుందని ఈ ముగ్గురి జీవిత వృత్తాంతాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. ఈ ముగ్గురి జయంతి అయిన ఈ పుణ్య తిధిలో వారి జీవిత గాథలు మనకందించిన స్ఫూర్తితో సామాజిక సద్భావన, సమరసతా సాధనలో మరో ముందడుగు వేద్దాం. భారత్ మాతాకీ జయ్.

MAY 6 శంకర జయంతి మరియు సంత్ సూరదాస్ జయంతి, MAY7 భగవద్రామానుజుల జయంతి.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.