News

శుక్రగ్రహంపై పరిశోధనలకు భారత అంతరిక్ష సంస్థ సిద్ధం

570views

న్యూఢిల్లీ: సౌర మండలంలోనే అత్యంత వేడిగ్రహం శుక్రుడి రహస్యాలను విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో సిద్ధమవుతోంది. 2024 డిసెంబర్​లో వీనస్ మిషన్ చేపట్టేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందుకోసం శుక్ర గ్రహశాస్త్రంపై ఇస్రో ఒకరోజు వర్క్‌షాపు నిర్వహించింది. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన ఇస్రో ఛైర్మన్‌ సోమ్‌నాథ్‌.. వీనస్‌ మిషన్‌ ప్రాజెక్టు నివేదిక సిద్ధమైనట్టు తెలిపారు.

ప్రయోగానికి అవసరమైన నిధులు కూడా సమకూరినట్టు చెప్పారు. ఈ ప్రయోగం ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధించేలా దృష్టి సారించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. భారత్‌ వద్ద తగిన సామర్థ్యం ఉన్నందున.. తక్కువ సమయంలో వీనస్‌ మిషన్‌ను ప్రయోగించగలదని సోమ్‌నాథ్‌ తెలిపారు.

2024 డిసెంబర్‌లో వీనస్‌ మిషన్‌ చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత సంవత్సరం భూమి, శుక్రుడు ఒకే వరుసలోకి రానున్నందున అంతరిక్ష నౌకను కక్ష్యలోకి చేర్చాలని భావిస్తోంది. మళ్ళీ 2031లో భూమి, శుక్రుడు ఒకే వరుసలోకి రానున్నారు. శుక్రగ్రహంపైకి ఇదివరకు పంపిన మిషన్ల మాదిరి ఫలితాలు పునరావృతం కాకుండా చంద్రయాన్-1, మార్స్ మిషన్ సందర్భంగా సాధించిన ఫలితాలు రాబట్టాలని ఇస్రో ఛైర్మన్ సోమ్ నాథ్ శాస్త్రవేత్తలకు సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి