
గిరిజన భాషల పరిరక్షణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ కోయ భాషను డిజిటల్ రూపంలో భద్రపరిచే దిశగా ఐటీడీఏ కీలక చర్యలు చేపట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత టూల్‌ను అభివృద్ధి చేసి కోయ గిరిజన భాషను డిజిటల్ వేదికపై అందుబాటులోకి తీసుకురానున్నట్లు కోటరామచంద్ర పురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ) కె. రాములు నాయక్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని కేఆర్‌పురం ఐటీడీఏ కార్యాలయంలో కోయ భాష నిపుణులు, అనువాదకులతో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. కోయ భాష పదజాలం, ఉచ్చారణ, వ్యాకరణం, సాంప్రదాయ పదబంధాలను డిజిటల్ రూపంలో నమోదు చేయడం, ఏఐ వ్యవస్థలో పొందుపరచడంపై చర్చించారు.
ఈ సందర్భంగా పీఓ కె. రాములు నాయక్ మాట్లాడుతూ, కోయ గిరిజన భాష పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతికత సహాయంతో గిరిజన భాషలను భవిష్యత్ తరాలకు అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
వర్క్‌షాప్‌లో పాల్గొన్న ప్రొఫెసర్ డాక్టర్ చిక్కాల నాగరాజు మాట్లాడుతూ, భాష అనేది సంస్కృతికి ప్రతిబింబమని, ఒక భాష అంతరించిపోతే దానితోపాటు ఆ భాషకు చెందిన సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను పరిరక్షించే బాధ్యతను గుర్తించాలని పిలుపునిచ్చారు.
గిరిజన భాషల డిజిటలీకరణ ద్వారా వాటి అధ్యయనం, బోధన, పరిశోధనకు కొత్త అవకాశాలు ఏర్పడటంతో పాటు, కోయ భాషను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసే అవకాశం కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు





