
శ్రీనగర్: సింహం పంజా విసిరింది. పగవాడికి తన అసలు దెబ్బ రుచి చూపింది. ఉరుము లేని పిడుగులాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోని ఉగ్రవాదుల శిబిరాలపై విరుచుకు పడింది. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న, ఏళ్ల తరబడి కొనసాగుతున్నట్లుగా భావిస్తున్న ఉగ్రవాద శిబిరాలపై మనదేశ వైమానిక దళం మెరుపుదాడులకు దిగింది. మంగళవారం తెల్లవారు జామున 3:30 గంటలకు ఈ దాడులు ఆరంభం అయ్యాయి.
తురుఫుముక్కతో దాడి..
వైమానిక దళం తురుపుముక్కగా భావించే మిరాజ్ యుద్ధ విమానాలను వైమానిక దళ అధికారులు రంగంలో దించారు. షుమారు 12 జెట్ ఫైటర్లతో దాడి చేశారు. ఉగ్రవాద శిబిరాలపై సుమారు 1000 కేజీల పేలుడు పదార్థాలను జార విడిచారు. ఈ దాడులను రెండు దేశాల రక్షణ దళాలు ధృవీకరించాయి. తాము చేసిన దాడులు వందశాతం విజయవంతం అయ్యాయని వైమానిక దళ అధికారి ఒకరు ధృవీకరించారు. భారత వైమానిక దళం దాడులు చేసిన విషయం నిజమేనంటూ పాక్ ఆర్మీ కూడా నిర్ధారించింది. వ్యూహం ప్రకారం తాము చేసిన దాడులు లక్ష్యాన్ని చేరుకున్నాయని భారత అధికారులు తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న బాలాకోట్, ఛకోటీ, ముఝ్రాబాద్ లో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి.
ప్రతీకార దాడులు:
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన చోటు చేసుకున్న ఉగ్రదాడి తరువాత భారత్ ఈ స్థాయిలో ప్రతీకారానికి దిగడం ఇదే తొలిసారి. పుల్వామా దాడి చోటు చేసుకున్న కొద్దిరోజుల్లోనే భారత వైమానిక దళం రాజస్థాన్ లోని పాకిస్థాన్ సరిహద్దుల్లో తన బలాన్ని ప్రదర్శించింది. వైమానిక విన్యాసాలను చేపట్టింది. దాడులు తప్పవని వైమానిక దళం చెప్పకనే చెప్పినట్టయింది. సరిగ్గా 12 రోజుల్లో పాక్ ఉగ్రశిబిరాలపై భారత్ ప్రతీకారానికి దిగింది.





