News

పుల్వామా దాడి తరువాత ఆ న్యూస్ ఛానళ్లు అల్లర్లను ప్రోత్సహించేలా ప్రవర్తించాయట:వివరణ ఇవ్వాలన్న కేంద్రం

600views

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో వార్తలను ప్రసారం చేస్తోన్న 13 న్యూస్ ఛానళ్లపై కేంద్రం కన్నెర్ర చేసింది. కొరడా ఝుళిపించింది. షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారంరోజుల్లోగా సరైన వివరణ ఇవ్వాలని సూచించింది. ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోతే.. కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కేంద్రం హెచ్చరించింది. అక్కడిదాకా బాగానే ఉంది. ఎందుకు షోకాజ్ నోటీసులను కేంద్రం జారీ చేసింది? ఇంత తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించాల్సిన అవసరం ఏమొచ్చింది? కారణం- పాకిస్తాన్ సైనిక అధికార ప్రతినిధి ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఆయా న్యూస్ ఛానళ్లు ప్రసారం చేయడమే. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన చోటు చేసుకున్న జైషె మహమ్మద్ ఉగ్రవాదుల దాడి తరువాత భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణం అలముకుంది. పుల్వామా ఉగ్రదాడి చోటు చేసుకున్న మూడు రోజుల తరువాత పాకిస్తాన్ సైనిక అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. యుద్ధానికి సంబంధించిన విషయాలపై మాట్లాడారు.
ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ను మనదేశానికి చెందిన 13 న్యూస్ ఛానళ్లు ప్రసారం చేశాయి. ఏబీపీ న్యూస్, సూర్య సమాచార్, తిరంగ టీవీ, న్యూస్ నేషన్, జీ హిందుస్తాన్, టోటల్ టీవీ, ఏబీపీ మాజ, న్యూస్ 18 లోక్ మత్, జై మహారాష్ట్ర, న్యూస్ 18 గుజరాత్, న్యూస్ 24, సందేశ్ న్యూస్, న్యూస్ 18 ఇండియా ఛానళ్లు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ను ప్రసారం చేయడాన్ని కేంద్రం తప్పు పట్టింది. దీన్ని విద్రోహక చర్యగా గుర్తించింది. దేశంలో శాంతిభద్రతలను రెచ్చగొట్టేలా వ్యవహరించాయని కేంద్రం షోకాజ్ నోటీస్ లో పేర్కొంది. అల్లర్లను, జాతి వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించేలా ప్రవర్తించాయని పేర్కొంది. జాతి సమగ్రతకు, దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లే చర్యలకు దిగాయని అంటూ కేంద్ర సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వశాఖ ఈ నోటీసులను జారీ చేసింది.

Source : One India

https://telugu.oneindia.com/news/india/13-channels-get-showcause-notices-from-the-government-airing-pakistan-army-spokespersons-239776.html