
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(ఉమ్మడి పౌరస్మృతి) అమలుపై మధ్యప్రదేశ్ భోపాల్ పర్యటన సందర్భంగా చిన్న హింట్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ తర్వాతి నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి మద్దతుగా వరుస ప్రకటనలు చేస్తున్నారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాక పుష్కర్ సింగ్ ధామీ.. ఈ అంశాన్ని మొదటగా లెవనెత్తారు. ఆ తర్వాత కమలం పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్.. యూనిఫాం సివిల్ కోడ్ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై రాష్ట్రంలో చర్చిస్తామని వెల్లడించారు.
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై చర్చ జోరందుకుంది. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సమాజ్వాదీ ప్రోగ్రెసివ్ పార్టీ అధినేత శివపాల్ యాదవ్.. యూసీసీని కచ్చితంగా అమలు చేయాలన్నారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ను అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.





