
న్యూఢిల్లీ: ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉందని ప్రధాని మోదీ అన్నారు. పాల ఉత్పత్తి టర్నోవర్.. గోధుమలు, బియ్యం ఉత్పత్తి కంటే ఎక్కువే అని తెలిపారు. భారత్లో ఏటా రూ.8.5 లక్షల కోట్ల విలువైన పాలను భారత్ ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు. చిన్న రైతులే.. పాడి పరిశ్రమ అతిపెద్ద లబ్ధిదారులని అన్నారు. సహకార డెయిరీ.. చిన్న రైతులను, మహిళలను, గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని మోదీ అన్నారు.
బనాస్ డెయిరీ ఆసియాలోని ప్రముఖ పాల ఉత్పత్తి తయారీ కంపెనీలలో ఒకటిగా పేరు పొందింది. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సన్నకారు రైతులకు అండగా ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశవ్యాప్తంగా ఉన్న సన్నకారు రైతుల బాధ్యతను తాను తీసుకున్నానని తెలిపారు. అందుకే సంవత్సరానికి రూ.6000 రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. అక్కడి మహిళలు తమ పిల్లల కంటే కూడా ఎక్కువ ప్రేమతో పశువులను చూసుకుంటున్నారని మోదీ ప్రశంసించారు.





