
ఈ ప్రపంచంలో ఏ దేశమైనా రెండు వేల సంవత్సరాల బానిసత్వాన్ని అనుభవించిందా?
గ్రీకులు, శకులు, హూణులు, కుషాణులు, మొఘలాయిలు, పోర్చుగీసు వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు ఇలా ఎందరో మన దేశంపై దండయాత్రలు చేశారు. పరిపాలన సాగించారు. భారతీయ సంస్కృతిని నాశనం చేయడానికి ప్రయత్నించారు. అనేకమందిని మతం మార్చారు. కాదన్నవారినెందరినో హతం చేశారు. వారివారి సంస్కృతులను, ఆచార వ్యవహారాలను, భాషలను భారతీయ సంస్కృతిలో చొప్పించే ప్రయత్నం చేశారు.
మహమ్మదీయుల దురాక్రమణ యత్నంతో జరిగిన విధ్వంసం, వినాశనం, జన హననం అంతా ఇంతా కాదు. అలాగే ఆంగ్లేయుల పాలనా కాలంలోనూ భారతీయ సంస్కృతిని విషతుల్యం చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. మన ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను, వేషధారణను, పూజా విధానాలను మూఢమైనవిగా ప్రచారం చేశారు. భారతీయులు ఆత్మన్యూనత చెందే విధంగా మన చరిత్రను వక్రీకరించారు. మనదేశంలో క్రైస్తవాన్ని వ్యాప్తి చేయడానికి అనేక కుటిల యత్నాలకు పాల్పడ్డారు. నేటికి కూడా కొందరు భారతీయులలో మనకు కనిపిస్తూ ఉన్న బానిస మనస్తత్వానికి ఆంగ్లేయుల కుటిల ప్రయత్నాలు, చరిత్ర, విద్యా విధానమే కారణం.
దేశ చరిత్రలో అతి పెద్ద విషాదం….
ఎట్టకేలకు 1947 ఆగస్టు 15న ఆంగ్లేయుల కబంధ హస్తాలనుంచి భారత్ కు విముక్తి లభించిందని అనుకుంటూ ఉంటే…. ఆనాడే దేశం భారత్, పాకిస్థాన్ లుగా రెండు ముక్కలైంది. లక్షలాదిమంది హిందువులు స్వదేశంలోనే నిరాశ్రయులుగా మారారు. తమ ఆస్తిపాస్తులను విభజిత భూభాగంలోనే వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందరో హిందువుల మాన ప్రాణాలు ఇస్లామిక్ చాందసవాదుల కర్కశ పదఘట్టనల క్రింద నలిగి నాశనమైపోయాయ్. వేల ఏండ్ల భారతదేశ చరిత్రలో అతి పెద్ద విషాదమది. ఆ విషాదం నుంచి వారి వారసులు ఇప్పటికీ కోలుకోలేకున్నారు. స్వంత దేశంలోనే ఇప్పటికీ వారు అత్యంత దయనీయ పరిస్థితులలో జీవితాన్ని వెళ్లదీస్తున్నారు.
యావత్ దేశానికి 1947 లోనే స్వాతంత్రం సిద్ధించినా అప్పటి పాలకుల అసమర్థ, స్వాభిమాన రహిత, నిర్లిప్త విధానాల కారణంగా 1962 వరకు గోవా పోర్చుగీసు వారి చేతిలోనే ఉండిపోయింది. ఆర్ ఎస్ ఎస్ వంటి కొన్ని జాతీయవాద సంస్థల తీవ్ర ప్రయత్నము, పోరాటము, సహకారంతో భారత సైన్యం గోవాని స్వాధీనపరచుకోగలిగింది.
దేశం ముక్కలైనా సమసిపోని అసహనవాదం
మతం ఆధారంగా దేశ విభజన జరిగినా… అప్పటి పాలకులకు ముందు చూపు లేకపోవడం, వారి సంకుచిత విధానాలు, స్వాభిమాన రాహిత్యం కారణంగా కొందరు ముస్లిములు దేశంలోనే ఉండిపోవడంతో, వారి సామ్రాజ్యవాద, దురాక్రమణ వాద, దౌర్జన్యకర ధోరణితో దేశం ఇప్పటికీ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్న సంగతి మనకు తెలుసు. మనో భావనల పేరుతో ప్రతి చిన్నదానికీ గొడవలు, రాళ్ల దాడుల ద్వారా హింస, నిత్య అశాంతి, అసహనం ఒకవైపు. బాంబు పేలుళ్లు, తుపాకులతో స్వైర విహారం, తీవ్రవాదం, విధ్వంసం, వినాశనం మరోవైపు. CAA, NRC, ఇప్పుడు తాజాగా హిజాబ్ పేరుతో దేశవ్యాప్త ఆందోళనలకు కుట్ర. వీటికి అంతం ఉందా? స్వాతంత్ర్యానంతరం మన దేశాన్ని పాలించిన వారి దివాళాకోరు విధానాలే దీనికంతటికీ కారణం.
స్వదేశీకి పాతర – విదేశీ సంస్థలకు జాతర
ఆ విధానాలతోనే మనదేశంలో స్వదేశీకి పాతరేసి ప్రతి చిన్న అవసరానికీ విదేశాల ముందు సాగిలపడాల్సిన దుస్థితిని మనకు కల్పించారు అప్పటి మన పాలకులు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నీరుగార్చారు. ప్రపంచానికే అన్నం పెట్టే వ్యవసాయాన్ని దండగ అనుకునే పరిస్థితి కల్పించారు. ఈరోజు గ్రామీణ యువత సైతం వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించేందుకు వెనకాడుతున్న పరిస్థితి మనకు తెలుసు. ఏ రైతుతో మాట్లాడినా “తాము విధిలేక వ్యవసాయం చేస్తున్నామంటున్నారే గానీ ఏదో సాధించాలనే తపనతో, సాధించగలమనే విశ్వాసంతో వ్యవసాయం చేస్తున్న వారు నేడు లేరు. వ్యవసాయదారుల కష్టాలను కడతేర్చటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకురాజూసిన రెండు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, వ్యవసాయదారుల ముసుగులో కొందరు విదేశీ ప్రేరిత ఉగ్రవాదులు, విదేశాల నుంచి వచ్చిన సొమ్ములతో నెలల తరబడి ఉద్యమాలు నడిపి, దేశంపై, ప్రభుత్వంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన దుష్ప్రచారానికి, దేశ వ్యతిరేక కుట్రలకు పాల్పడి చివరకు ఆ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిన దుస్థితిని ప్రభుత్వానికి కల్పించిన సంగతి మనకు తెలిసిందే.
మతమార్పిడి దందా…
మరోవైపు ఆంగ్లేయుల పాలనా కాలంలో హిందూ సంస్కృతిపై మొదలైన పరోక్ష దాడులు నేటికీ మన దేశంలో పాఠ్యాంశాల ద్వారా, టీవీలు, పత్రికలూ, సినిమాలు, సీరియళ్ళ ద్వారా కొనసాగుతూనే ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చిన సొమ్ములతో ప్రలోభాలకు గురిచేసి, అసత్య ప్రచారాలను పాల్పడి, కల్లాకపటమెరుగని అమాయకులను, పేదలను తమ కల్లబొల్లి కబుర్లతో బుట్టలో వేసుకుని పెద్ద ఎత్తున మత మార్పిడులకు పాల్పడ్డారు, ఇప్పటికీ పాల్పడుతున్నారు. అవినీతి, నిరుద్యోగం, పేదరికం, అంటు వ్యాధులతోనూ, అంటరానితనం, వరకట్నం వంటి సామాజిక రుగ్మతలతోనూ కూడా దేశం ఎంతగానో నలిగిపోయింది.
నిరంతర గంగా ప్రవాహం భారత్ పయనం….
అయితే…. ఇన్ని సమస్యల మధ్య కూడా భారత్ ఏనాడూ సంయమనాన్ని, సహనాన్ని కోల్పోలేదు. ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను, తన సౌభ్రాతృత్వ హృదయాన్ని, ధీరోదాత్తతను చాటుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నది.
మనకు స్వాతంత్ర్యం వచ్చీ రావడంతోడనే మన నాయకులు ఉదారంగా ఇచ్చిన సొమ్ములతో ఆయుధాలు సమకూర్చుకుని మన దేశం పైకి దండయాత్రకు వచ్చిన పాకిస్థాన్ కు, ఉన్న పరిమిత వనరులతోనే బుద్ధి చెప్పి పంపింది మన భారత సైన్యం. 1965, 1971 లలో సైతం భారత్ పై యుద్ధానికి తెగబడిన పాక్ మూకలకు భారత సైన్యం తగిన బుద్ధి చెప్పింది. 1999 కార్గిల్ యుద్ధంలోనూ పాకిస్థాన్ తన దుస్సాహసానికి తగిన మూల్యం చెల్లించక తప్పలేదు.
కయ్యాలమారి పొరుగు దేశాలతో దేశానికి పొంచి ఉన్న ప్రమాదం దృష్ట్యా భారత్ రెండుసార్లు నిర్వహించిన అణు పరీక్షలలో సత్ఫలితాలు సాధించింది. కొన్ని బలమైన దేశాల పరోక్ష సహకారంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనాలు భారత్ లో అశాంతి, అలజడుల సృష్టికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నా, వాటి కుటిల యత్నాలను ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ, అటు బాహ్య, ఇటు అంతర్గత శత్రువులతో నిరంతరం పోరాటం చేస్తూ, దేశం తన గమనాన్ని గంగా ప్రవాహంలా నిరంతరంగా, చిరంతనంగా కొనసాగిస్తూనే ఉంది.
ప్రపంచాన్ని వణికించిన ఆర్ధిక మాంద్యం – మన పొదుపు గుణం ముందు ఓడి చూస్తున్నది చోద్యం
సుదీర్ఘ కాలం పాటు సాగిన విదేశీపాలన, స్వాతంత్ర్యానంతర స్వదేశీ పాలకుల అవినీతిమయ పాలన కారణంగా ఒకానొక సమయంలో తీవ్రమైన దుర్భిక్షానికి, దారిద్ర్యానికి ఆలవాలమైన మన దేశం ఆ పరిస్థితుల నుంచి వేగంగా కోలుకుందనే చెప్పాలి. 2008, 2009 ప్రాంతాలలో ఏర్పడిన ఆర్థిక మాంద్యంతో ప్రపంచమంతా ఉక్కిరి బిక్కిరయినా భారత్ మాత్రం తట్టుకుని నిలబడగలిగింది. పరిస్థితులకు తగినట్లుగా నడచుకోవడం, పొదుపుగా వ్యవహరించడం భారతీయులకు వెన్నతో పెట్టిన విద్య. ఆ కారణంగానే ప్రపంచాన్ని గడగడలాడించిన ఆర్థిక మాంద్యం సైతం భారత్ ప్రగతిని నిరోధించలేకపోయింది.
సత్ఫలితాలనిస్తున్న రైతుల వినూత్న ప్రయోగాలు
విదేశీ, స్వదేశీ పాలకులు, దళారులు ఎన్ని మోసాలకు, ఎంత అణచివేతకు గురిచేసినా, ఎరువులు, పురుగు మందుల పేరుతో ఎన్ని వ్యాపార సంస్థలు ఎంతగా దోపిడీకి గురి చేసినా భారతీయ రైతులు మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలతో వ్యవసాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అనేక కొత్తరకం వంగడాలను కనుగొన్నారు. “వ్యవసాయంలో భారతీయ రైతులు అనుసరిస్తున్న వినూత్న విధానాలను చూసి మేమే ఎంతగానో ఆశ్చర్యపోయాము.” అంటూ ఒకానొక కార్యక్రమంలో కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారంటే… భారతీయ రైతులు ఎంతటి ప్రతిభావంతులో, భారతీయ వ్యవసాయ విధానాలు ఎంత గొప్పవో మనకు అవగతమవుతుంది. ఇప్పుడు తాజాగా భారతీయ రైతులు తమ పూర్వీకులు అనుసరించిన సంప్రదాయ, సేంద్రియ వ్యవసాయ విధానాల ద్వారా అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. ఈ మార్గం ఇటు రైతులకు, అటు వినియోగదారులకు శ్రేయోదాయకంగా ఉంది. ఈ విధానాలతోనైనా వ్యవసాయ రంగం యొక్క భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని ఆశిద్దాం.
హద్డులెరుగని ప్రతిభాపాటవాలు
ఒకప్పుడు ఉపగ్రహాల ప్రయోగానికి విదేశాల కరుణాకటాక్షాలపై ఆధారపడే దీన దుస్థితి నుంచి నేడు మనమే పలు దేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించే సాంకేతికతను సొంతం చేసుకున్నాం.
ఒకప్పుడు లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేసి, సాధారణ తుపాకులను సైతం విదేశాల నుంచి కొనుగోలు చేసే దురదృష్టకర స్థితి నుంచి నేడు మనమే ఆయుధాలను తయారుచేసి వివిధ దేశాలకు అందించే సామర్ధ్యాన్ని సాధించాం. ఇది కదా ప్రగతి? ఇలాగే కదా మారాల్సింది దేశం యొక్క గతి?
భారత్ నుంచి విదేశాలకు వెళ్లిన వారెందరో తమ కృషి, పట్టుదల, నిరంతర పరిశ్రమ కారణంగా ఈరోజు ఆయా దేశాలలో కీలక స్థానాలలో పని చేస్తున్నారు. మన దేశానికి, ఆ దేశాలకే కాదు యావత్ ప్రపంచానికీ తమ అద్భుత ప్రతిభతో వన్నెలద్దుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు శ్రీమతి కమలా హారిస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, అడాబె, పెప్సికో వంటి సంస్థలకు నేతృత్వం వహిస్తున్న సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, పరాగ్ అగర్వాల్, శాంతానూ నారాయణ్, ఇంద్రా నూయీ వంటి వారెందరో భారతీయుల ప్రతిభకు ప్రపంచం ముందు తార్కాణంగా నిలిచారు.
ఈ మధ్య తాజాగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ అనేక దేశాలు కరోనా తాకిడికి అల్లాడిపోతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి వెలుగు చూసిన తొలినాళ్లలో ప్రపంచంలోని చాలా దేశాలు తమకు పట్టబోయే దుస్థితిని మరచి భారత్ పై సానుభూతిని వర్షించాయి. భారత్ వైపు జాలి చూపులు చూశాయి. “అయ్యో 130 కోట్ల జనాభా వున్న భారతం ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కొంటుందో? భారతీయులు మాస్కులు ధరించగలరా? శానిటైజర్ లు వాడగలరా? అనారోగ్యం పాలైతే ఆసుపత్రులు సరిపోతాయా? ఆక్సిజన్ అందుతుందా? మందులు అందుతాయా? అంటూ WHO తో సహా అనేక అంతర్జాతీయ సంస్థలు, మీడియా, దేశాలు అన్నీ తెగ బాధపడిపోయాయ్. కానీ కొందరు స్వదేశీ, విదేశీ శక్తులు కావాలని సృష్టించిన అన్ని అడ్డంకులను, అవరోధాలను సైతం అధిగమించి భారత్ ఎవ్వరూ ఊహించని విధంగా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే సమర్థవంతమైన టీకాలతో ప్రపంచం ముందుకు వచ్చింది. నవ్విన నాపచేలే పండాయన్న చందాన “అయ్యో భారత్ గతి ఏమైపోతుందో?” అని జాలిపడిన వారే భారత్ పంపే టీకాల కోసం ఎదురు చూసేలా చేసింది. దటీజ్ నయా భారత్…
విశ్వహితానికి భారతదేశం
కరోనా అనే కాదు, ప్రపంచం ముందున్న అనేక సవాళ్లకు భారతీయ యోగ, భారతీయ ఆయుర్వేదం, భారతీయ కుటుంబ వ్యవస్థ, భారతీయ జీవన విధానం, భారతీయ ఆధ్యాత్మికత, భారతీయ గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు…. ఇవన్నీ పరిష్కారం చూపిస్తున్నాయి. డాక్టర్ డేవిడ్ ఫ్రాలే చెప్పినట్టుగా “భారతదేశం యొక్క ఉన్నతి ప్రపంచ యొక్క ఉన్నతి” అనే విషయాన్ని ఋజువు చేస్తూ, నిజం చేస్తూ భారత్ నేడు ప్రగతి పథంలో దూసుకు పోతున్నది.
దీనంతటికీ కారణం భారతీయుల యొక్క ఆలోచనా విధానం, సహనశీలత, సంయమనం, ఔదార్యం, మన సరళ జీవనం, విరళ చింతనం, భారతీయ వాంగ్మయం, కుటుంబ వ్యవస్థ, పొదుపు గుణం, పరిస్థితులకనుగుణంగా సర్దుకుపోయే గుణం…. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో…. అందుకే ఇన్ని కష్టాలను భరించి, ఇన్ని అవమానాలను సహించి, ఎందరో తిరోగమన వాద పాలకుల తప్పిదాలను క్షమించి ఎప్పుడూ ఎవ్వరినీ పన్నెత్తు మాటైనా అనకుండా, ఏ పొరుగు దేశంపైకీ కయ్యానికి కాలు దువ్వకుండా నిశ్శబ్దంగా అడుగులో అడుగేసుకుంటూ ప్రగతి పథంలో పరుగులు తీస్తున్న ఓ భారతీయుడా శభాష్ రా… ఇలాగే ఎప్పుడూ విసుగన్నదే లేక, విరామమెరుగక నడవరా ముందుకు. విజయతీరాల వైపుకు. ప్రగతి శిఖరాల చివరకు.





