* ఆనందయ్య మందుకు అనుమతులిచ్చిన తమిళనాడు ప్రభుత్వం – ప్రజలలో వ్యక్తమవుతున్న హర్షాతిరేకాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం.
కృష్ణపట్నం ఆనందయ్య మందుకు అనుమతి లభించింది. అయితే అది మన ప్రభుత్వ అనుమతి అనుకునేరు…. కాదండోయ్ పక్క రాష్ట్రం తమిళ తంబీలు మన ఆనందయ్యను అక్కున చేర్చుకున్నారు. ఆయన తమ రాష్ట్రంలో మందులు తయారు చేసుకుని పంపిణీ చేసుకునేందుకు అవసరమైన అనుమతులను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఇచ్చింది. పక్క రాష్ట్రం పర్మిషన్ ఇచ్చినా సొంత రాష్ట్రంలో మాత్రం ఆనందయ్య మందును అడ్డుకోవడంపై ప్రజలలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కథా కమామీషు…..
కృష్ణపట్నం ఆనందయ్య, ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు యావద్దేశంలోనూ పెను సంచలనం సృష్టించిన వ్యక్తి. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకి చెందిన ఆనందయ్య తనకు వారసత్వంగా వచ్చిన ఆయుర్వేద వైద్య పరిజ్ఞానంతో కరోనా నియంత్రణకు, నయం చేసేందుకు నాటు మందులను తయారు చేశాడు. ఆసుపత్రులు కరోనా వైద్యం పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటూ ఉండిన నేపథ్యంలో ఉచితంగా లభించే ఆనందయ్య మందు సామాన్య ప్రజలకు ఒక ఆశాదీపంగా కనిపించింది. కరోనా సోకకుండా ముందు జాగ్రత్తగా మందు వాడి లబ్ధి పొందినవారు కొందరైతే, కరోనా సోకిన తర్వాత రూపాయి ఖర్చు లేకుండా ఆనందయ్య మందు వాడి కోలుకున్నవారు ఎందరో. ఆక్సిజన్ అందక, ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ ఆనందయ్య కంటి చుక్కల మందు వాడి ప్రాణాలు కాపాడుకున్న వారు కోకొల్లలు.
కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్య మందుకు అడుగడుగునా మోకాలడ్డుతూ వచ్చింది. అనేక నిబంధనల పేరు చెప్పి, ఆనందయ్య మందుకు శాస్త్రీయత లేదంటూ ఎన్నో అవాంతరాలను సృష్టించింది. ఆయనను అరెస్టు చేసేందుకు కూడా ఒక దశలో యత్నించింది. ఆ మధ్య ఆనందయ్య స్వగ్రామంలోని కొందరు ప్రబుద్ధులు ఆనందయ్య, తన మందును పంపిణీ చేస్తే ఆ మందు కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి వల్ల తమకు కరోనా సోకే ప్రమాదమున్నదని అడ్డగోలుగా వాదిస్తూ ఆనందయ్య ఇంటిముందు ధర్నాకు సైతం దిగారు. దీని వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నదనే గుసగుసలు కూడా వినిపించాయి.
మరిప్పుడేమైంది?
అర్హతలు, పత్రాలు, ప్రభుత్వాల అనుమతులతో సంబంధం లేకుండా ఆనందయ్య మందు పనితీరే కొలమానికగా ప్రజలు మాత్రం ప్రాణాలు కాపాడే ఆనందయ్య మందు కోసం ఎగబడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వ ఆంక్షలకు జడిసిన ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన ఆనందయ్య తమిళనాడులోని కోయంబత్తూరు కేంద్రంగా తాను తన మందును తయారుచేసి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అందుకు అనుమతులు ఇప్పించవలసిందిగా కోరుతూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఆనందయ్య అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన తమిళనాడు ప్రభుత్వం, ఆనందయ్య మందును తమ రాష్ట్రంలో తయారుచేసి పంపిణీ చేసుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది.
దీనిపై దేశ వ్యాప్తంగా స్వదేశీ పరిజ్ఞానం, ఉత్పత్తులపై అభిరుచి, అభిమానం కలిగిన వారందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పక్క రాష్ట్రం వారు అనుమతులు ఇచ్చినా సొంత రాష్ట్రం వారు మాత్రం అడ్డంకులు సృష్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనయినా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆనందయ్య మందు అందరికీ అందుబాటులోకి రావాలని కోరుకుందాం.