ArticlesNews

కనుమరుగైపోతున్న దురాచారాలపై కలవరమెందుకు?

175views

విధవరాండ్రపై వివక్ష …… మన ఆచరణలో మధ్యలో ఏర్పడిన రుగ్మత అది. అహల్యాబాయి హోల్కర్, కేలడి చెన్నమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రాస్మణి, మహారాణి తారాబాయి భోంస్లే వీరందరూ భర్తృ హీనులే. రాజ్యాలేలారు. భర్తృ హీనను నిరాదరించమని ఏ ధర్మ శాస్త్రమూ చెప్పలేదు. కొన్ని సామాజిక పరిస్థితులలో వారిని దూరంగా పెట్టడం జరిగింది. ఆ తర్వాత అమానవీయ, అవమానకర ఆచారాలు కొన్ని మొదలయ్యాయి. అట్లని హిందూ సమాజం సంస్కరణలకు దూరంగా ఎప్పుడూ లేదు. మన సమాజంలో నిరంతర సంస్కరణ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మా నాయనమ్మ, అమ్మమ్మ, పెద్దమ్మమ్మలు, మా నాయనమ్మ తోడికోడళ్ళు అందరూ నాకు ఊహ తెలిసేనాటికే భర్తృహీనులు. మా ఇండ్లలో, ఊరిలో ఎప్పుడూ అలాంటి వివక్షను నేను ప్రత్యక్షంగా చూడలేదు. నా జీవితానుభవంలో నేను చూసిందానికంటే సినిమాల్లోనూ, పుస్తకాలలోనూ విధవరాండ్రపై సమాజం దారుణమైన వివక్షను చూపుతుందని చూశాను, చదివాను. అట్లని వారి పట్ల వివక్ష మన సమాజంలో అసలే లేదని నేననను. సినిమాలు, పుస్తకాలలో ఎగ్జాగరేట్ చేసి చూపారని నా అభిప్రాయం. వాటి వెనుకెవరున్నారో మీకు ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదనుకుంటాను?

మరో విషయం కూడా ఇక్కడ ప్రస్తావనార్హం. సతీ సహగమనంపై చాలా రాద్ధాంతం చేస్తూంటారు కదా? నా వయస్సు 47. ఇన్నేండ్లలో నేనేనాడూ మా ఇంటి వారు కానీ, బంధువులలో కానీ, స్నేహితుల కుటుంబాలలో కానీ ఎవరైనా గానీ సతీ సహగమనం చేసినట్లుగా పెద్దలెవరైనా చెప్పుకోగా కూడా వినలేదు. “మీ ఇలాకాలో మీరేమైనా విన్నారా?” అని నాకు తెలిసిన కొందరిని ప్రశ్నించాను కూడా. ప్చ్ నో యూజ్. “మరి సతి లేనే లేదంటారా?” అంటారేమో? ముస్లిం దండయాత్రలలో యుద్ధాలలో మరణించిన హిందూ యోధుల భార్యలను ముసల్మానులు బానిసలుగా పట్టుకెళ్ళేవారు. ఆ తర్వాత వారి దౌర్భాగ్యాన్ని మనవంటివారం ఊహించనైనా లేం. శీలాన్ని ప్రాణం కన్నా మిన్నగా భావించిన ఆ తల్లులు ప్రాణార్పణ గావించేవారు. కొన్నాళ్ళకదో ప్రతిష్ఠాత్మకమైన విషయంగా, గౌరవ సూచకంగా సమాజంలో పరిణమించింది. దాంతో కొంతకాలంపాటు సాధారణ మరణాల సందర్భాలలో కూడా అది నడిచింది. అప్పటి సామాజిక పరిస్థితులను బట్టి ఎక్కడో జరిగిన చిన్న చిన్న సంఘటనలను పట్టుకుని దేశమంతటా జరిగిన అనాచారాలుగా కొందరు పనిగట్టుకుని ప్రచారం చేశారు. ఏదేమైనప్పటికీ నా చిన్నతనం నాటికే విధవలపై వివక్ష బాగా తగ్గింది. ఇప్పుడు దాదాపు కనుమరుగవుతోంది. ఎవరేమిటో కూడా అర్థం కాని ప్రస్తుత పరిస్థితులలో…. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరముందా?

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.