తే22/1/2019ది మంగళవారం విజయవాడలోని సిద్దార్ధ ఫార్మసీ కళాశాలలో “ భారత్ కు టిబెట్ సమస్య ఎంత ముఖ్యమైనది?” అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. ఈ సదస్సులో టిబెట్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ ఆచార్య యాషి మాట్లాడుతూ కళలు, శాస్త్రాలు, సాంప్రదాయాలు, సంస్కృతి ఇలా అన్ని విషయాలలో భారత్, టిబెట్ ల మధ్య ఎంతో సారూప్యం వున్నదని, చైనా టిబెట్ ను దురాక్రమించాలని చూస్తున్న ఈ తరుణంలో భారత్ తన సంపూర్ణ సహకారాన్ని టిబెట్ కు అందించాల్సిన అవరమున్నదని తెలిపారు. ప్రపంచంలో చాలా దేశాలు సుఖ శాంతులతో మనుగడ సాగిస్తున్నాయని శాంతి కాముకులైన ప్రజలున్న టిబెట్ లో మాత్రం శాంతి లేదని, భారత్ అంతర్జాతీయ వేదికలపై చైనా దుర్నీతిని ఎండగట్టాలని, ఆ విషయంలో భారత్ టిబెట్ కు సహకరించాలని వారు తెలిపారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ పలుచోట్ల ఈ విధమైన అవగాహనా సదస్సులను తమ బృందం నిర్వహిస్తున్నదని ఆచార్య యషి తెలిపారు.
రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ శ్రీ పి.జి. కామత్ మాట్లాడుతూ భౌగోళికంగా టిబెట్ సరిహద్దు భారత్ కు చాలా కీలకమైనదని తెలిపారు. రక్షణపరంగా ఎంతో కీలకమైన టిబెట్ భూభాగ రక్షణ విషయంలో భారత్ లోని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయని, చైనా ఒక వైపు నుంచి టిబెట్ ను దురాక్రమిస్తూ వుంటే, దానివల్ల భారత్ కు పొంచి వున్న ప్రమాదాన్ని గుర్తించకుండా “ భారత్ చీనీ భాయి భాయి” వంటి వ్యర్ధ నినాదాలతో కాలక్షేపం చేశారని విమర్శించారు. ఇప్పటికైనా చైనా అంటే వున్న భయం వీడి, టిబెట్ భూభాగం యొక్క ప్రాధాన్యతని గుర్తెరిగి టిబెట్ రక్షణకు యావత్ భారత ప్రజలు, ప్రభుత్వం నడుం బిగించాలని కోరారు.
JNU విశ్వ విద్యాలయం [ఢిల్లీ] చైనీస్ స్టడీస్ విభాగం ఆచార్యులు ప్రొఫెసర్ శ్రీకాంత్ కొండపల్లి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశమూ టిబెటన్లకు ఆశ్రయం కల్పించడానికి సిద్ద పడలేదని, ఒక్క భారత్ లో మాత్రమే 1.61 లక్షల మంది టిబెటన్లు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. భారత్ టిబెట్ కు సాంస్కృతికంగా, రాజకీయంగా మార్గదర్శిగా నిలచిందని తెలిపారు.
టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ పై పరిశోధన చేస్తున్న టెంపా గ్యాల్ట్సెన్ జమ్లా మాట్లాడుతూ సముద్ర మట్టానికి 7 వేల మీటర్ల ఎత్తున వుండే టిబెట్, భూగోళానికి నాభి స్థానం వంటిదని. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల శీతోష్ణ స్థితులు టిబెట్ లోని వాతావరణ మార్పులపై ఆధారపడి ఉంటాయని తెలిపారు. భారత్ లో ప్రవహించే బ్రహ్మపుత్ర వంటి అనేక నదుల జన్మస్థానం టిబెట్ అని తెలిపారు. చైనా దురాక్రమణ కారణంగా ఆ జల వనరులన్నీ భారత్ కు దక్కకుండా చైనా దారిమళ్ళించే ప్రయత్నం చేస్తున్నదని, భారత్ కు జల సిరులు ప్రసాదించే టిబెట్ ను కాపాడుకోవడం భారత్ కు అత్యంత ఆవశ్యకమని తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు టిబెట్ పార్లమెంట్ సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అంశంపై పలువురు విజయవాడ పుర ప్రముఖుల సందేహాలను ఆచార్య యషి నివృత్తి చేశారు.





