సరిహద్దులో దేశ రక్షణ కోసం పాటుపడుతూ ప్రాణాలు కోల్పోతున్న భారత సైనికులకు సంబంధించి ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం జరగకపోయినా భారత సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని.. ఇలా భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ప్రహార్ సమాజ్ జాగృతి సంస్థ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
మన దేశంలో ప్రస్తుతం యుద్ధం జరగనప్పటికీ ఎంతో మంది సైనికులు అమరులవుతున్నారు. యుద్ధం జరగకున్నా కూడా క్రమంలో ఇలా ఎందుకు జరుగుతోంది అని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేలా చూస్తేనే.. భారత్ అన్ని విషయాల్లోనూ ఎదుగుతుంది. మనదేశం టాప్ లో నిలవాలి అంటే ప్రతి ఒక్కరూ త్యాగాలు చేయడం నేర్చుకోవాలి అని ఆయన కోరారు.
దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు పోరాడాలి. ప్రభుత్వం, పోలీసులు, ఆర్మీతో బాటుగా సాధారణ పౌరులు కూడా దేశ భద్రతలో తమ వంతు పాత్ర పోషించాలి. ప్రతి ఒక్కరూ దేశం కోసం జీవించడం అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఇజ్రాయెల్ దేశం కూడా మనలాగే స్వాతంత్ర్యాన్ని 1948లో సాధించింది అని.. కానీ వాళ్లు ఇప్పుడు మనకన్నా చాలా అంశాల్లో ముందు ఉన్నారని ఆయన అన్నారు.