News

మతం మారిన దళితులకు రిసర్వేషన్లు కల్పించడంఆమోద యోగ్యం కాదు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సామాజిక సమరసతా ఫౌండేషన్ విజ్ఞప్తి.

823views

ఎస్.ఎస్.ఎఫ్ ధార్మిక మండలి తీర్మానాలు : 

విజయవాడలోని పెనమలూరు వద్ద గల పద్మావతి కళ్యాణ వేదిక నందు నిన్న 10/1/2019 న సమరసతా సేవా ఫౌండేషన్ అధ్వర్యంలో జరిగిన పూజ్య ధర్మాచార్యుల సదస్సు సందర్భంగా అక్కడ జరిగిన పత్రికా సమావేశంలో పూజ్య కమలానంద భారతీ స్వామి మాట్లాడుతూ దేవాలయాల కేంద్రంగా  హిందూ సమాజంలోని సాంఘిక దురాచారాలను రూపుమాపటానికే ఎస్.ఎస్.ఎఫ్ పనిచేస్తోందని తెలిపారు. ప్రస్తుతం 321 మండలాలలో ధర్మ ప్రచారకులు పని చేస్తూ వున్నారని భవిష్యత్తులో అన్ని మండలాలకు, మునిసిపాలిటీలకు ధర్మ ప్రచారకులను నియమించాలని ధార్మిక మండలి నిర్ణయించిందని తెలిపారు. అన్ని దేవాలయాలకు భజన మండళ్ళు వుండాలని, అన్ని దేవాలయాలలో భజన, కోలాటం నిర్విఘ్నంగా కొనసాగేందుకు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి, తితిదే ఎప్పటిలాగే తమ సంపూర్ణ సహకారాన్ని అందించాలని ధార్మిక మండలి ఆకాంక్షిస్తోందని తెలిపారు. తిరుమలలో వివిధ సందర్భాలలో జరిగే అఖండ భజన తదితర కార్యక్రమాలలో ఈ భజన మండళ్ళకు కూడా చోటు కల్పించాలని తితిదేను కోరుతున్నట్టు తెలిపారు. తితిదే సాయంతో ఎస్.ఎస్.ఎఫ్ ద్వారా నూతనంగా నిర్మితమైన దేవాలయాలలో పనిచేస్తున్న అర్చకులకు గౌరవ వేతనం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నూతనంగా నిర్మించిన దేవాలయాలకు అవసరమైన గొడుగులు, ఇతర పూజా సామగ్రిని అందించవలసినదిగా తితిదేకు విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలోని తితిదే కళ్యాణ మండపాలను హిందూ ధార్మిక కార్యక్రమాలకి ఉచితంగా ఇవ్వాలని తితిదేకు విజ్ఞప్తి  చేస్తున్నట్టు తెలిపారు. చట్ట విరుద్దంగా, అక్రమంగా, అనుమతి లేకుండా నిర్మితమవుతున్నచర్చి నిర్మాణాలను ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. గత మూడేళ్ళుగా ఎస్.ఎస్. ఎఫ్ కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం అందించిన సాయాన్ని కొనియాడారు. హిందూ ధర్మంపై నిష్ఠ కలిగిన వారినే హిందూ దేవాలయ ట్రస్టీలుగా నియమించాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా మతం మారిన ఎస్.సి క్రైస్తవులకు కల్పించడం అంటే నిజమైన ఎస్.సి లకు అన్యాయం చెయ్యడమేనని, కాబట్టి ఆ ఆలోచన తగదని ప్రభుత్వానికి విన్నవిస్తున్నట్టు తెలిపారు.

నూతన కార్యవర్గ ప్రకటన:

ఈ సందర్భంగా స్వామి నూతనంగా ఏర్పాటయిన ఎస్.ఎస్.ఎఫ్ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ స్వర్గీయ MGK మూర్తి గారు వారి చివరి శ్వాశ వరకు ఎస్.ఎస్.ఎఫ్ కు అమూల్యమైన సేవలను అందించారని, వారి హఠాన్మరణం కారణంగా ఎస్.ఎస్.ఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చెయ్యాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన కార్యవర్గాన్ని కమలానంద భారతీ స్వామి పత్రికలకు తెలియజేశారు.

అధ్యక్షులు – రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ దాసరి శ్రీనివాసులు

కార్య నిర్వాహక అధ్యక్షులు – శ్రీ తాళ్ళూరు విష్ణు

ఉపాధ్యక్షులు – శ్రీ భవానీ ప్రసాద్, శ్రీ హనుమంతరావు

కార్యదర్శి – శ్రీ పాకాల త్రినాధ్

సహ కార్యదర్శి _ శ్రీ కోట సునీల్

కోశాధికారి – శ్రీ రంగ ప్రసాద్

సభ్యులు – శ్రీ కల్వకుంట జగన్మోహన్ రెడ్డి, శ్రీ కే. శ్యాం ప్రసాద్, డా|| విజయ రాఘవాచారి, శ్రీ వి. సుధాకర్, డా|| రవీంద్రనాథ్ నియమితులయ్యారు.

అలాగే రాష్ట్ర ధర్మ ప్రచారకులుగా శ్రీ సాయిరాం, ఎస్.ఎస్.ఎఫ్ సామాజిక కార్యక్రమాల ప్రత్యేక ఆహ్వానితులుగా వున్న శ్రీ జనార్ధన్లు యదావిధిగా కొనసాగుతారని తెలిపారు.