News

శబరిమలలోకి వెళ్లనిస్తారు కానీ… వావర్ మసీదులోకి అనుమతించారా? మశీదులోకి వెళ్ళటానికి తమిళనాడు మహిళల ప్రయత్నం : అడ్డుకున్న పోలీసులు.

453views

పలక్కాడ్: మసీదులోకి ఇద్దరు మహిళలు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కేరళలో జరిగింది. ఈ మహిళలు కేరళలోని మసీదులోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, వారు తమిళనాడుకు చెందినవారిగా భావిస్తున్నారు.

వావర్ మసీదులోకి వెళ్లే ప్రయత్నం

ఆ మహిళలు మెయిన్ వాలాయర్ చెక్‌పోస్టులో కళ్లుగప్పి, ఆ తర్వాత నాడుపుని చెక్ పోస్టు నుంచి కేరళలోకి వచ్చారు. వీరు సోమవారం శబరిమల సమీపంలోని వావర్ మసీదులోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిన అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ మహిళలు మాట్లాడుతూ.. శబరిమల ఆలయంలోకి మహిళలను వెళ్లేందుకు అనుమతించినప్పుడు మసీదులోకి వెళ్లేందుకు ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు.

పలు సెక్షన్లపై కేసు

వీరు గత వారం మీడియాతో మాట్లాడుతూ.. తాము మసీదులోకి వెళ్తామని చెప్పారు. అన్నట్లుగానే సోమవారం సాయంత్రం మసీదులోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిపై ఐపీసీ సెక్షన్ 153 కింద కేసు నమోదు చేశారు. వీరు హిందూ మక్కల్ కట్చి అనే సంస్థకు చెందినవారుగా తెలుస్తోంది. పోలీసులు వీళ్లను కోర్టులో హాజరు పరచనున్నారు.

శబరిమలలోకి అనుమతిస్తూ, మసీదులోకి అనుమతించరా?

కాగా, శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు గత ఏడాది తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేరళలోని పినరాయి విజయన్ ప్రభుత్వం ఆ తీర్పును అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇద్దరు మహిళలు ఇటీవల శబరిమల ఆలయంలోకి ప్రవేశించారు. ఇప్పుడు వావర్ మసీదులోకి మహిళల ప్రయత్నం గమనార్హం. అయితే హిందూ ఆచారాలను పక్కన పెట్టి మహిళలను శబరిమలలోకి తీసుకు వెళ్తున్న ప్రభుత్వం, మసీదులోకి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

Source : One India

https://telugu.oneindia.com/news/india/two-women-en-route-vavar-mosque-custody/articlecontent-pf205949-237601.htm