పినరయి విజయన్ గద్దె దిగు..! కేరళలో వెల్లువెత్తుతున్న నిరసనలు. తెలుగు రాష్ట్రాలకూ కేరళ సెగ. కేరళ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం.

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించిన తర్వాత తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పినరయి విజయన్ చేస్తున్న పనులకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. పినరయి విజయన్ హిందువులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని, ఆయన నిర్ణయాల వలనే కేరళలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని అంటున్నారు. శబరిమల కర్మ సమితి పిలుపుతో కేరళలో బంద్ కొనసాగుతోంది. హిందూసంఘాలన్నీ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.
ప్రశాంతంగా బంద్ పాటిస్తున్న చాలా ప్రాంతాల్లో బీజేపీ నాయకులపై దాడులు జరిగాయి. కేరళ ప్రభుత్వ తీరుపై పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. సీఎం పినరయి విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మహిళలు కూడా పెద్ద ఎత్తున కేరళ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. త్రిసూర్ జిల్లాలో బీజేపీ నేతలపై సోషల్ డెమొక్రాటిక్ పార్టీ నేతలు దాడికి దిగారు. ఇక రోడ్ల మీదకు వచ్చిన హిందూ సంఘాల నాయకులను ఎలా పడితే అలా కొడుతున్నారు పోలీసులు. పినరయి విజయన్ గద్దె దిగాలని పెద్ద ఎత్తున ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా చిచ్చు రేపుతోంది. అయ్యప్ప భక్తులతో పాటు హిందూ సంఘాలకు చెందిన కార్యకర్తలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు మిన్నంటాయి. హైదరాబాద్ మల్కాజిగిరి ప్రాంతంలోని ఆనంద్‌బాగ్ లో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడం కేరళ ప్రభుత్వ తప్పిదమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈక్రమంలో కేరళ సీఎం దిష్టిబొమ్మ తగులబెట్టారు. హిందు వ్యతిరేక కార్యకలాపాలు ఆపాలని, లేనిపక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. శబరిమల ఘటనపై యాదాద్రి భువనగిరి జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడాన్ని నిరసిస్తూ ఆలేరులో అయ్యప్ప భక్తులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేరళ సీఎం పినరయి విజయన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. శబరిమల పవిత్రతను కాపాడాలని నినదించారు.
Source : Bharath Today & One India
https://telugu.oneindia.com/news/telangana/ayyappa-devotees-bjp-cadre-protest-against-sabarimala-issue-237431.html





