రాయ్‌పూర్: హిందూ, ముస్లిం సిద్ధాంతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఆయన, రెండు మతాల ఆధ్యాత్మిక విషయాల పట్ల లోతైన అవగాహన సాధించారు… అంతేకాదు, కేవలం మాటలలో మతం లేదని, మానవులందరినీ సమంగా చూసేవాడే మనిషని, తోటివారిని ప్రేమించి, ఆ ప్రేమను పొందకలిగిన వారే భగవంతుడిని చూడగలరని ప్రబోధించారు… ఆ మహాత్ముడే నేటి పాకిస్తాన్‌లోని రావీ నదీతీరంలోని నన్కానా సాహిబ్‌లో సంప్రదాయ కుటుంబంలో 1469లో జన్మించిన గురునానక్. నేడు ఆయన జయంతి. ప్రపంచ వ్యాప్తంగా సిక్కులు ఘనంగా జయంతి కార్యక్రమాలను నిర్వహించుకున్నారు.
భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాజధాని, రాయ్‌పూర్‌లోని గురుద్వారాలో గురునానక్ జయంతిని వైభవంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురునానక్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘన నివాళుర్పించారు. అక్కడ జరిగిన కార్యక్రమాలను తిలకించారు. గురుద్వారా నిర్వహణ కమిటీ ఆయనకు సరోపా బహూకరించింది.