News

గోకవరంలో ఘనంగా ఝాన్సీ ల‌క్ష్మీబాయి జయంతి

615views

కర్నూలు: జిల్లాలో కొత్తపల్లి మండలం గోకవరంలో శుక్రవారం ఘనంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి జరిగింది. గ్రామంలోని భక్తకన్నప్ప గురుకుల ఆవాసంలో ఈ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో ఆవాస ప్రముఖ రామకృష్ణ, విద్యార్థులు ఝాన్సీ చిత్రపటానికి పూలమాలు వేసి, ఘన నివాళుర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, 1828 నవంబర్‌ 19వ తేదీన ఉత్తర భారత రాజ్యమైన వారణాసిలో ఆమె జన్మించిందని, ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి అని తెలిపారు.


పరాయి పాలకుల అణచివేతపై తిరుగుబాటు జరిపి, మాతృభూమి స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించినడానికి సైతం వెనకాడలేదన్నారు. వ్యాపారం కోసం వచ్చిన ఆంగ్లేయులు ఈస్ట్‌ ఇండియా కంపెనీ ద్వారా దేశాన్ని వశపరచుకోవడం ప్రారంభించారని, 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్‌ ఆర్మీని గ‌డ‌గ‌డ‌లాడించిన‌ ధీరవనిత రాణి లక్ష్మీబాయి అని వివరించారు. ఆమెకున్న ధైర్యం, పరాక్రమం, వివేకం, భారతదేశంలో 19వ శతాబ్దంలో మహిళలకు ఉన్న అధికారంపై ఆమెకున్న ముందుచూపు, ఆమె చేసిన త్యాగాలు, ఆమెని స్వాతంత్ర పోరాటంలో ఒక ప్రసిద్ధ వ్యక్తిగా నిలిపాయన్నారు. విద్యార్థులందరూ ఆమె ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. భారతదేశం జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌గా ఆమె భారతదేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయిందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి