News

గతుకుల రహదారిలో భారత్‌-చైనా సంబంధాలు

388views
  • విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌

సింగ‌పూర్‌: భారత్‌-చైనా మధ్య సంబంధాలు గతుకుల రహదారిలో ఉన్నాయని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ తెలిపారు. ఒప్పందాలను ఉల్లంఘిస్తూ కొన్ని చర్యలను చైనా చేపట్టిందని, అందుకు ఆ దేశం వద్ద ఇప్పటికీ విశ్వసనీయమైన వివరణ లేదని ఆయన మండిపడ్డారు. ద్వైపాక్షిక సంబంధాలను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నదీ చైనా నాయకత్వమే చెప్పాలని స్పష్టం చేశారు.

సింగపూర్‌లో జరిగిన ‘గ్రేటర్‌ పవర్‌ కాంపిటీషన్‌ : ది ఎమర్జింగ్‌ వరల్డ్‌ ఆర్డర్‌’ చర్చా కార్యక్రమంలో ఓ ప్రశ్నకు సమాధానంగా జైశంకర్‌ మాట్లాడుతూ, భారత్‌-చైనా సంబంధాల్లో ప్రస్తుత పరిస్థితి గురించి చైనా నాయకత్వానికి ఏదైనా సందేహం ఉన్నట్టు తాను భావించడం లేదని చెప్పారు.

తన వల్ల సక్రమంగా జరగనిది ఏమిటో కూడా ఆ దేశ నాయకత్వానికి తెలుసునని తెలిపారు. తాను చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో అనేకసార్లు సమావేశమయ్యానని తెలిపారు. తాను అత్యంత స్పష్టంగా, సమంజసంగా మాట్లాడానని చెప్పారు. అటువైపు నుంచి స్పష్టత లేదని పేర్కొన్నారు.

తూర్పు లడఖ్‌లో చైనాతో ఘర్షణలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, భారత్‌-చైనా మధ్య అమలవుతున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా కొన్ని చర్యలు చేపట్టినందువల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు గతుకుల రహదారిలో నడుస్తున్నాయని చెప్పారు. ఈ ఉల్లంఘనలకు ఇప్పటికీ చైనా వద్ద సరైన, విశ్వసనీయమైన వివరణ లేదని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి