
జమ్ముకశ్మీర్లో సరిహద్దుల నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు పాకిస్థాన్ దళాలు ప్రయత్నించగా భారత సైనికులు తిప్పికొట్టారు. వారి కుట్రను భగ్నం చేశారు. నాగౌమ్ సెక్టార్లో ఎల్ఓసీ వద్ద భారత సైనికుల పోస్టులపై దాడులు చేసేందుకు పాకిస్థాన్ బార్డర్ యాక్షన్ బృందం(పాక్ బీఏటీ) ప్రయత్నించింది. దీంతో వెంటనే స్పందించిన మన బలగాలు ఎదురుదాడికి దిగి పాక్‌కు చెందిన ఇద్దరు చొరబాటుదారులను మట్టుబెట్టారు. మృతుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, పాక్‌లో తయారైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు. భారీ దాడికి కుట్ర పన్ని చొరబాటుకు యత్నించారని అధికారులు భావిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సైనికులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చొరబాటుదారులు సాధారణ పాకిస్థాన్ సైనికులు ధరించే దుస్తులు ధరించి ఉన్నారని.. ఎల్ఓసీ వెంబడి ఉన్న దట్టమైన అడవుల గుండా భారత్‌లోకి ప్రవేశించాలని ప్రయత్నించారని తెలిపారు. వారి కదలికలను గమనించి మన సైనికులు వెంటనే కాల్పులు ప్రారంభించారని.. రాత్రంతా కాల్పులు కొనసాగాయని వెల్లడించారు.
చొరబాటుకు యత్నించిన మరికొందరు తప్పించుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. భారత సరిహద్దు రక్షణ దళం కూడా కొందరు చొరబాటుదారులను చూసిందని తెలిపారు. చొరబాటుదారుల మృతదేహాలను తీసుకెళ్లాలని పాకిస్థాన్ సైన్యానికి సమాచారం ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాల్పులు జరుగుతున్న సమయంలో పాక్ ఆర్మీ ఈ చొరబాటుదారులకు పూర్తి మద్దతు ఇచ్చిందని చెప్పారు. సకాలంలో స్పందించి చొరబాటుదారుల కుట్రను భగ్నం చేసినందుకు ఆర్మీ అధికారులు సైనికులను ప్రశంసించారు.
Source : Bharat Today
https://www.bhaarattoday.com/news/national/jammu-and-kashmir-terror-attack/29945.html





