News

కేరళలో దీపాలు పట్టుకుని నిలబడిన వారి సంఖ్య 25 లక్షలు..

630views

శబరిమల విషయంలో కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై హిందూ బంధువులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్ళాలని ప్రయత్నించారు. కానీ వారిని అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. అలా ప్రయత్నించిన వారి వెనుక ఎవరు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని జరుగుతున్నా కూడా చూసీ చూడనట్లు ఉంది కేరళ ప్రభుత్వం. మహిళలు ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న వారిపై లేనిపోని కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి తరుణంలో 2.5 మిలియన్ల మంది అయ్యప్ప జ్యోతి పట్టుకుని రోడ్డుపై నిలబడ్డారు. ఈ జ్యోతి విప్లవం కేరళ సర్కార్ లో వణుకు తెప్పిస్తోంది.

ఏడువందల తొంభై అయిదు కిలోమీటర్ల పొడవున లక్షల మంది శ్రద్ధాళువులు నిశ్శబ్దంగా, చేతికొక్క దీపాన్ని పట్టుకుని వెలుగులతో తమ నిరసన తెలిపారు. మొదట 10 లక్షల దాకా పాల్గొన్నారని భావించారు.. అయితే వివిధ గ్రామాల్లో కూడా ఈ అయ్యప్ప జ్యోతిని పట్టుకుని నిలిచారు. దాదాపు 25 లక్షల మందికి పైగా ఈ సరికొత్త విప్లవంలో పాల్గొన్నారు. అయ్యప్ప దేవాలయ పూజా అర్చనా విధానాలపై జోక్యం చేసుకుని, హిందూ విశ్వాసాలను వమ్ము చేసే కుట్రకు వ్యతిరేకంగా గురువారం ఈ నిరసన కొనసాగింది. కేవలం గుప్పెడు గుండెలో దాగిన గంపెడు నమ్మకం…. అరచేతుల్లో గోరంత దీపం…శబరిమల అయ్యప్ప సన్నిధిలో అపచారం చేసేందుకు కొద్ది మంది చేస్తున్న కుట్రను వ్యతిరేకిస్తూ యావత్ కేరళ చీకటిపై వెలుగుల విజయానికి ప్రతీక అయ్యింది. అయ్యప్ప జ్యోతి పేరిట జరిగిన ఈ ప్రదర్శన లో పిల్లా పాపా, చిన్నా పెద్దా, సకలాంగులూ, వికలాంగులూ అందరూ పాల్గొన్నారు. ఉత్తర కొసనున్న కాసర్ గోడ్ నుంచి దక్షిణాగ్రాన ఉన్న కన్యాకుమారి దాకా ప్రభుత్వ దమనకాండపై దీపంతో కోపం ప్రదర్శించారు.
Source: bharath Today