
590views
ఒకప్పడు అన్నలు, నక్సలైట్లుగా పిలిచే ప్రస్తుత మావోయిస్టుల పేరు చెప్పగానే అడవులు, ఏజెన్సీ ప్రాంతాలు గుర్తుకొస్తాయి. ఖమ్మం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోనే మావోయిస్టుల కార్యకలాపాలు ఉంటాయనేది పోలీసుల భావన. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో అయితే అసలు మావోయిస్టుల ఉనికే ఉండదనే అభిప్రాయానికి వస్తుంటారు. అలాంటిది ఇటీవల నగరంలో మావోయిస్టుల జాడలు బయటపడటంతో అటు పోలీసులు, ఇటు నిఘా వర్గాలు నివ్వెరపోయాయి. ఎందుకిలా జరిగింది..? తప్పెక్కడ జరుగుతోంది..? నగరంలో మావోల కదలికలను ఎందుకు పసిగట్టలేక పోతున్నాం..? ఏజెన్సీల్లో, అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన వారు నగరంలో ఎలా ఆశ్రయం పొందుతున్నారు..? నగరాన్ని సేఫ్ జోన్‌లాగా ఎలా మార్చుకుంటున్నారు..? ఇంతటి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్న మనం ఎందుకు అలసత్వంగా ఉన్నామని అటు నిఘా వర్గాలు, ఇటు పోలీసు ఉన్నతాధికారులు అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది.
సేఫ్ జోన్‌గా నగరం…
ఇప్పటి వరకు ఐఎస్ఐ ఉగ్రవాదులు నగరాన్ని స్లీపర్ జోన్‌గా వాడుకున్నారు. రాను రాను ఉగ్రవాదంపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో నగరంపై ఉన్న ఆ మచ్చ కొద్ది కొద్దిగా తొలగిపోయింది. ఇప్పుడు అదే తరహాలో మావోయిస్టులు నగరాన్ని సేఫ్ జోన్‌గా, షెల్టర్ జోన్‌గా వాడుకుంటున్నట్లు పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. అడవుల్లో తమ కార్యకలాపాలను విస్తరింపజేస్తున్న మావోయిస్టులు అవసరనమైనప్పుడు నగరంలో తలదాచుకుంటున్నారు. ఎక్కడో కార్యకలాపాలు కొనసాగించే దళ సభ్యులు నగరంలోకి వచ్చినా పోలీసులు, నిఘా వర్గాలు గుర్తించలేకపోవడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.
ఉలిక్కిపడ్డ పోలీసులు…
రెండు రోజుల క్రితం నగరంలోని మౌలాలీ హౌసింగ్ బోర్డు కాలనీలో అక్కాచెల్లెళ్లు అయిన ముగ్గురు మావోయిస్టులు ఆత్మకూరు అనూష, భవాని, అన్నపూర్ణలను విశాఖ పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో నగర పోలీసులు, నిఘా వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దాంతో ఎక్కడ నిఘా లోపం జరుగుతోంది..? మావోయిస్టుల కదలికలను సైతం గుర్తించలేని విధంగా ఎక్కడ అలసత్వం జరిగింది..? అని పోలీసు ఉన్నతాధికారులు నిఘా వైఫల్యంపై చర్చించుకుంటున్నారు.
నేరస్థుల ఆటకట్టిస్తున్నప్పటికీ…
ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ దేశంలోనే నెం-1గా చెప్పుకుంటారు ఇక్కడి పోలీసులు. నగరంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా వెంటనే పసిగట్టేలా, నిందితులను పట్టుకునేలా ట్రై కమిషనరేట్ల పరిధిలో లక్షల సంఖ్యలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేశారు. స్థానిక, అంతర్ రాష్ట్ర నేరగాళ్ల ఆటకట్టించడానికి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. నేరస్థులు దేశంలో ఏ మూలన దాక్కున్నా పట్టుకొచ్చి మరీ కటకటాల వెనక్కి నెడుతున్నారు. అలాంటి మన నిఘా వర్గాలు మావోల కదలికలను గుర్తించడంలో విఫలమవుతున్నాయని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కమ్యూనికేషన్ వ్యవస్థ కీలకం…
నిజానికి ఉగ్రవాదులు, తీవ్రవాదులు, అంతర్‌రాష్ట్ర నేరస్థులు, మావోయిస్టుల వంటి వారిని గుర్తించడానికి పోలీసులు కమ్యూనికేషన్ వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడతారనేది తెలిసిందే. అయితే… అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో మావోయిస్టుల కదలికలను గుర్తించడానికి సెల్‌టవర్ లొకేషన్స్‌లపై ఆధారపడుతుంటారు. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాలు, మండలాల్లో లొకేషన్స్‌ను బట్టి మావోయిస్టుల కదలికలను గుర్తించేవారు. దాంతో మావోయిస్టులు పోలీసులను తప్పుదోవ పట్టించడానికి, దొరకకుండా ఉండటానికి దగ్గరలో ఉన్న సెల్ టవర్లను పేల్చి వేస్తూ ఉండేవారు. మావోయిస్టులు ప్రాంతాలను, లోకేషన్స్ మార్చుకోవడానికి ఇబ్బందులు లేకుండా చూసుకునేవారు. అయితే.. నగరంలో అలాంటి పరిస్థితి ఉండదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అనేక సందర్భాల్లో సెల్‌టవర్ లోకేషన్స్ తప్పుగా చూపించడం, వందల సంఖ్యలో టవర్లు ఉండటం, విపరీతమైన రద్దీ కారణంగా కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించడం కొంతకష్టమని తెలుస్తోంది. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా, నిఘా వర్గాలు పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని పోలీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Source: Bharath Today.
https://www.bhaarattoday.com/news/news/maoist-hyderabad/29847.html





