News

ఆంధ్రాలో హిందూ దేవాలయాల కూల్చివేత!

884views

పాతపట్నం: ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా, పాతపట్నంలో జాతీయ రహదారి విస్తరణ పేరిట హిందూ దేవాలయాలను కూల్చివేశారు. దీంతో భక్తులు విలపించారు. కనీసం విగ్రహాలు బయటకు తీసుకోవడానికి సమయం ఇవ్వాలని కోరినా నిర్వాహకులు పట్టించుకోలేదని ఆరోపించారు. నరసన్నపేట నుండి ఒడిశాలోని మోహన్‌ ప్రాంతం వరకు 326 ఎ జాతీయ రహదారిని విస్తరించే పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా పాతపట్నం రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఆంజనేయ స్వామి, అదే ప్రాంగణంలోని వినాయక స్వామి గుడిని శ‌నివారం కూల్చివేశారు. అలాగే, ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల ఇలవేల్పు, ఉత్క‌ళాంధ్రుల‌ ఆరాధ్య దైవం నీలమణి దుర్గ అమ్మవారు ఆలయం సింహద్వారాన్ని కూల్చివేశారు.

పాతపట్నం రైల్వే స్టేషన్‌కు సంబంధించి ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే ట్రాక్‌పై ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి హైవే అధికారులు నిర్ణయించారు. దీంతో నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయంటూ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఆంజనేయ స్వామి, వినాయకుడి గుడిలను పూర్తిగా తొలగించారు. ఆలయాన్ని నమ్ముకొని జీవిస్తున్న పూజారులు బతుకులు రోడ్డున పడ్డాయని భక్తులు శాపనార్థాలు పెట్టారు. అలాగే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న అమ్మవారి కోవెల ప్రహరీ గోడ, సింహద్వారాన్ని కూడా అధికారులు కూల్చివేయడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాచీన ఆలయాలకు ప్రాధాన్యం ఇచ్చి, రోడ్డు మార్కింగ్‌, ఫ్లై ఓవర్‌ నిర్మాణం మార్చుకోవాల్సిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి