
తాము చెప్పిన మాట విని మతం మారలేదనే అక్కసుతో ఒక వ్యక్తిని అతని, భార్య అత్త కలిసి అతని ఆఫీస్ ముందే దారుణంగా కొట్టిన ఘటన ఓడిశా లోని గజపతి జిల్లా గోవిందపూర్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే బాధితుడు గోవిందపూర్ తహశీల్లో RI గా పని చేసే హిందువైన తబీర్ పాండా క్రైస్తవ మతావలంబి అయిన సురభిని ప్రేమించి 2014లో భవాని పట్నం కోర్టులో చట్ట బద్ధంగా వివాహం చేసుకున్నారు. అప్పట్నుంచి సురభి తన భర్త తబిర్ని మతం మారమని పోరు పెట్టసాగింది. తబిర్ అందుకు తిరస్కరించటంతో సమస్య ప్రారంభమైంది.
ఎంత సాధించి వేధించినా తబిర్ మతం మారడానికి అంగీకరించక పోవడంతో ఆగ్రహించిన అతని భార్య సురభి, ఆమె తల్లి తబిర్ని అతని ఆఫీసులో నుంచి బయటకి లాగి అతనిపై దారుణంగా దాడి చేశారు. అంతే కాకుండా అతన్ని దుర్భాషలాడారు.
దీనిపై తబిర్ మీడియాతో మాట్లాడుతూ తాను సురభిని ప్రేమించి వివాహం చేసుకున్నానని, నాటి నుంచి ఆమె కుటుంబ సభ్యులు తనని మతం మారమని వేధించటం మొదలు పెట్టారని, తన తల్లిదండ్రులకు తానొక్కడే కొడుకైనందువల్ల ఆ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ తాను మతం మారడానికి అంగీకరించలేదని, దీనితో ఆగ్రహించిన సురభి కుటుంబ సభ్యులు తామిద్దరినీ ప్రశాంతంగా కలసి వుండనివ్వకుండా చేశారని, అయినా సరే అన్నిటిని సహించి ఆమెతో కలసి జీవించానని చెప్పాడు. ఈ విషయమై గతంలోనే తాను పోలీసు రక్షణ కోరి ఉన్నానని కూడా తబిర్ చెప్పుకొచ్చాడు.
తబిర్ భార్య సురభి, ఆమె తల్లి జరిగిన సంఘటనను వ్యక్తిగత విషయంగా పేర్కొంటూ ఘటనపై స్పందించటానికి తిరస్కరించగా తబిర్ మాత్రం తన భార్య, అత్తలపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడం గమనార్హం.





