News

ఆఫ్ఘనిస్థాన్ : గురుద్వారాను అపవిత్రం చేసిన తాలిబన్లు

245views

ఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుండి మైనారిటీల పరిస్థితి దారుణంగా తయారైంది. తాము అందరినీ సమానంగా చూస్తామని తాలిబాన్ నేతలు చెబుతున్నా.. పరిస్థితులు మాత్రం చాలా తేడాగా ఉన్నాయి. కాబూల్ లోని కర్టే పర్వాన్ లో ఉన్న దష్ మేష్ గురుద్వారాలోకి తాలిబాన్లు బలవంతంగా ప్రవేశించారు. తాము ‘స్పెషల్ యూనిట్’ అంటూ లోపలికి చొరబడి గురుద్వారాను అపవిత్రం చేశారు. ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పునీత్ సింగ్ చందోక్ ఈ ఘటనపై ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆయుధాలతో వచ్చిన తాలిబన్లు సిక్కులను భయపెట్టారని…. కాబూల్ లోని సిక్కు సమాజం నుంచి తమకు అనేక ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. ఆయుధాలను ధరించిన కొందరు వ్యక్తులు తాము ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యేక యూనిట్ కు చెందిన వారమని చెపుతూ గురుద్వారాలోకి బలవంతంగా ప్రవేశించారని తెలిపారు. గురుద్వారాలో ఉన్న సిక్కు సంఘం అధ్యక్షుడిని బెదిరించారన్నారు. గురుద్వారా అంతా కలియదిరిగారని, పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్న సెక్యూరిటీ గార్డును కొట్టారని, తమను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారని తెలిపారు. గురుద్వారాకు ఆనుకుని ఉన్న స్కూల్ లోకి కూడా ప్రవేశించారని చెప్పారు. వారు గురుద్వారాని మాత్రమే కాకుండా దాని పక్కనే ఉన్న కమ్యూనిటీ స్కూల్ ఆవరణలో కూడా బాగా తిరిగారని చందోక్ వెల్లడించారు. గురుద్వారలో ఇంకా 20 మంది సిక్కులు చిక్కుకున్నారని, ఈ పరిస్థితిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.