News

ఆఫ్ఘన్ – భారత్ స్నేహం చరిత్రాత్మకమైనది

59views
  • ఐరాసలో జైశంకర్ వ్యాఖ్య

ఐక్య‌రాజ్య‌స‌మితి: అఫ్గానిస్తాన్‌లో తీవ్ర మానవతా సంక్షోభం చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. అఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి వర్చువల్‌ విధానంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశాన్ని ఉద్దేశించి భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ ప్రసంగించారు. ‘భారతదేశానికి అఫ్గాన్ ప్రజలతో చారిత్రక స్నేహం ఉంది. భవిష్యత్తులోనూ అది అలాగే కొనసాగుతుంది. ఇదే భారత్ విధానం’ అని జైశంకర్ ఉద్ఘాటించారు. అఫ్గాన్ సంక్షోభం ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావాన్ని చూపుతుందన్నారు.

అఫ్గానిస్థాన్‌ ప్రస్తుతం సవాళ్లతో కూడుకున్న, సంక్లిష్ట దశలో ఉందన్నారు. దాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అఫ్గాన్‌లో పేదరికం మరింత కోరలు చాచే ముప్పుందని.. అదే జరిగితే ప్రాంతీయ స్థిరత్వం కూడా దెబ్బతింటుందని పేర్కొన్నారు. అఫ్గాన్‌తో భారత్‌కు అనాదిగా స్నేహం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు. రాజకీయ, ఆర్థిక పరిస్థితులు చాలా మారినప్పటికీ.. ఆ దేశ ప్రజలకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి