ArticlesNews

ఆంధ్రా శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి

63views

ది 1922 వ సంవత్సరం. ఆంగ్లేయుల పాలనా కాలం. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోరుతూ గుంటూరు జిల్లా పెదనందిపాడు కేంద్రంగా పన్ను నిరాకరణ ఉద్యమం గ్రామ గ్రామాన జరుగుతున్న రోజులవి.

గుంటూరు జిల్లా కాకుమాను గ్రామం. గ్రామానికి జిల్లా కలెక్టరు వచ్చాడు. ఊళ్లో వారిని “మునసబు ఇల్లు ఎక్కడ?” అని అడిగితే ‘ముందుకు పోండి’ అని చెప్పారు. ఊళ్ళో చిన్నా, పెద్దా, ముసలీ, ముతకా ఎవర్నడిగినా అదే సమాధానం. పోలీసు, రెవెన్యూ ఉద్యోగులకు దుకాణాలలో ఉప్పు, చింతపండు, బియ్యం దొరకలేదు. ఉద్యోగులు, సైనికులు తినటానికి తిండి కూడా దొరకక పస్తులున్నారు. దాంతో పోలీసులు, సైనికులు, రెవెన్యూ ఉద్యోగులు కోపంతో చిర్రెత్తిపోయారు.

ఇంతలో ఒక ఆసామి బండి, ఎద్దులు తోలుకుపోతున్న దృశ్యం సైనికుల కంట పడింది. వెంటనే ఆ బండికి అడ్డుపడి అతనిపై దౌర్జన్యానికి ఒడిగట్టారు. ప్రజలు కోపోద్రిక్తులైనారు. సిపాయిలు తుపాకులు పేల్చడానికి సిద్ధపడ్డారు. క్షణాలలో ఆ ప్రదేశం రణభూమిగా మారిపోయింది. ప్రజలు కూడా ఏమాత్రం వెనుకంజ వెయ్యటం లేదు. సై అంటే సై అంటున్నారు.

టక్ టక్… టక్ టక్… టక్ టక్… ఎక్కడినుంచో ఓ 35 ఏళ్ళ యువకుడు గుర్రంపై బాణంలా దూసుకొచ్చాడు. ఆగండి…. అంటూ సింహగర్జన చేశాడు. చురకత్తుల వంటి సూటైన చూపులు. తుపాకులు ఎక్కుపెట్టిన సైనికులు సైతం స్థాణువుల్లా నిలుచుండిపోయారు. “శాంతించండి. ఇది ఉద్రిక్తతలకు సమయం కాదు. మనమంతా గాంధీజీ వచించిన శాంతి మార్గంలో ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మన నిబ్బరాన్ని కోల్పోకూడదు.” అంటూ ప్రజలకు ఉద్బోధించాడు. అప్పటివరకూ ఆగ్రహావేశాలతో ఊగిపోయిన ప్రజలందరూ అర నిముషంలో శాంతించారు. ఆ అహింసా మూర్తే మన ఆంధ్రా శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి.

నటుడు, గాయకుడు, నాయకుడు

పర్వతనేని వీరయ్య చౌదరి గుంటూరు జిల్లా, పెదనందిపాడులో లక్ష్మయ్య, అంకమ్మ దంపతులకు 1886 అక్టోబరు 4న జన్మించారు. చిన్నతనంలోనే దక్షిణాదికి వెళ్లి సంగీతంలో శిక్షణను పొంది హరికథా విద్వాంసుడిగా గుర్తింపు పొందారు.
పర్వతనేని వీరయ్య చౌదరి స్వాతంత్ర్య సమర యోధుడు. సత్యాగ్రహి. కళాతపస్వి. వైణిక విద్వాంసుడు. పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమ నాయకుడు. ఆంధ్ర శివాజీగా కీర్తి గడించారు.

పెదనందిపాడులో మిత్రుల సహకారంతో పోస్టాఫీసు, పాఠశాలల ఏర్పాటుకు కృషి చేశారు. కళాకారుడిగా హరిశ్చంద్ర వంటి నాటకాలలో నటించారు. త్రిపురనేని రామస్వామి చౌదరి రచించిన కురుక్షేత్ర సంగ్రామం నాటకంలో పర్వతనేని కృషుడి పాత్రలు ధరించగా ప్రతీహారి పాత్రను ఆచార్య రంగా పోషించారు. తుమ్మల సీతారామమూర్తి వ్రాసిన పద్యాలకు బాణీలను కట్టి వివిధ సభల్లో ఆలపించేవారు.

గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన పర్వతనేని స్వాతంత్ర్యోద్యమంలోని అన్ని ఘట్టాలలోనూ కీలకపాత్ర వహించారు. పన్నులు వసూలు చేసే ప్రభుత్వోద్యోగులను సాంఘిక బహిష్కరణ చేయాలని పర్వతనేని పిలుపునిచ్చారు. పెదనందిపాడు ప్రాంతంలో ఆరువేల మంది యువకులతో శాంతి సైనికులను తయారు చేశారు. బ్రిటీష్ ప్రభుత్వానికి పన్నులు చెల్లించవద్దని గుర్రంపై తిరుగుతూ ఊరూరు తిరిగి విస్తృతంగా ప్రచారం చేశారు. గ్రామాలలో కచేరిలు, బుర్ర కథలు ఏర్పాటు చేసి ప్రజలలో దేశ భక్తిని రగిల్చారు. ఉద్యమ నాయకునిగా పర్వతనేని చెరసాలకు కూడా వెళ్ళారు.

వెలుగు బాట

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన ఉద్యమాలలో ఒకటిగా పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం గుర్తింపు పొందింది.

పర్వతనేని వీరయ్య చౌదరి ప్రారంభించిన పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమంలో కీలక వ్యక్తి పుసులూరు కరణం గంధం నాగేశ్వరరావు. ఆయనను అరెస్టు చేసే ఉద్దేశంతో ప్రత్యేకాధికారి రూథరుఫర్డు ఒక బెటాలియన్ రిజర్వు పోలీసులతో ఒక నాటి ఉదయం పుసులూరు చేరుకున్నాడు. ఆతని రాక సంగతి తెలుసుకున్న ప్రజలందరూ తమ ఇండ్లలో దూరి తలుపులు బిడాయించుకున్నారు. కొందరు విశాలమయిన కరణంగారి ప్రాంగణంలోకి చేరారు. పుసులూరు గ్రామంలో రూధరుఫర్డు కరణంగారి ఇంటి కోసం ప్రయత్నించగా చెప్పటానికి ఒక్క మనిషీ కన్పించలేదు. బయట ఊరి నుండి వస్తున్న పుసులూరి సీతాపతి అనే ఆయన రూథరుఫర్డు కంటపడ్డాడు. ఆయనను పట్టుకొని కరణంగారి ఇల్లు చూపమని దబాయించాడు రూథరుఫర్డు. పుసులూరు సీతాపతి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సిపాయి. ఒక కాలు మడమలో తుపాకి గుండు దూసుకుపోగా కొద్దిగా కుంటుతూ నడిచేవాడు. కరణంగారి ఇంటి సమీపంలో ఒక పెద్ద మఱ్ఱి చెట్టు వుంది. దాని మీద కాంగ్రెస్ జెండా ఎగురుతున్నది. అది చూసిన రూథరుఫర్డు సీతాపతిని మఱ్ఱి చెట్టు ఎక్కి ఆ జెండాను తొలగించమని ఆజ్ఞాపించాడు. సీతాపతి చెట్టు ఎక్కాడుగానీ ఎంత సేపటికీ దిగలేదు. రూథరుఫర్డు అతనిని భయపెట్టడానికి అతని పక్క నుంచి గాలిలోకి పిస్తోలు పేల్చాడు. వెంటనే సీతాపతి చెట్టుపై నుండి నేరుగా రూథరుఫర్డు భుజాలపైకి దూకి ఆయన చేతిలో పిస్తోలును లాక్కొని ఆయనకే గురి పెట్టాడు. ఈ హఠాత్ సంఘటనతో రూథర్ ఫర్డు బిత్తరపోయాడు. సీతాపతి చెట్టుపై నుండి కిందికి దూకడం కరణంగారి ఇంటిలోని ప్రహరి గోడ లోపలి నుంచి చూస్తున్న ఊరి జనం ఆయన తుపాకి గుండు తగిలి పడిపోయాడని భావించి తలుపులు తోసుకుని ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న ప్రవాహంలా ఒడిసెలలతో రాళ్లు రువ్వుతూ రిజర్వు పోలీసుల మీదికి దూసుకొచ్చారు. ఈ దెబ్బతో చెరువు కట్ట మీద చెట్ల కింద కట్టివేసిన గుర్రాలను విప్పదీసుకొని రూథరుఫర్డు, ఆయన సిబ్బంది పలాయనం చిత్తగించారు.

బ్రిటిష్ సైన్యంలో, వారికి విధేయులుగా పనిచేసిన సీతాపతి వంటివారిలోనూ, సాధారణ ప్రజానీకంలోనూ దేశభక్తిని, తెంపరితనాన్ని రగుల్కొల్పిన ఘనత మాత్రం మన కథానాయకుడు, ఆంధ్రా శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరిదే.

వాక్కే వజ్రాయుధం

ఆయనది అద్భుతమైన గాత్రం. ఆయన తిలక్ మహాశయుని సందేశాన్ని వినిపిస్తూ ఉంటే ప్రజలు ముగ్ధులయ్యేవారు. ఆయన ప్రభావంవల్ల గ్రామాలలో ప్రజలు మిలిటరీ కవాతులకు భయపడే పరిస్థితి తొలగిపోవడమే కాదు ఆంగ్లేయ సైనికులపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక, తెగింపుకి కారణమైంది.

ఆహాహాహా! ఆంధ్రులమండీ! ఆంధ్రజాతి మాది
దక్షిణ భారత మకుట సీమ మా మహితరాంధ్రమండీ!
కృష్ణా, కావేరి, గోదావరులే కూడలి మాకండీ!
అక్షయముగ మూడుకోట్ల జనులాంధ్ర వీరులండీ
కొండా వెంకటప్ప మా నాయకుడండీ
పట్టాభియే మా ప్రతిభాశాలి గట్టి బుర్రమాది
రామా రామా కలియుగ రామా
కాశీనాథుడే విశ్వదాత మా వాసకూర్చునండీ…..

ఇలా సాగే బుర్రకథ ప్రజలలో ఆంధ్ర నాయకులపట్ల గౌరవాన్ని, స్వాతంత్ర్య కాంక్షను పెంపొందింపజేసింది.

ఉద్యమాన్ని ఆపటానికి ఉడుకుమోతుల యత్నాలు

పన్ను నిరాకరణ ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. ప్రజలలో అపూర్వ చైతన్యం వెల్లివిరుస్తోంది. ఆంగ్ల పాలకులు తమ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ పరిణామాలతో ఆంగ్లేయ పాలకులు బెంబేలెత్తి పోతున్న సమయం. ఆ సమయంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య గాంధీజీ దగ్గరకు వెళ్లి ఆంధ్రలో జరుగుతున్న పన్ను నిరాకరణ ఉద్యమం గాంధీ గారి ఆశయ, ఆదర్శాలకు భిన్నంగా జరుగుతున్నదని చెప్పాడట. దాంతో గాంధీజీ వెనుకాముందు ఆలోచించకుండా వెంటనే ఉద్యమాన్ని ఆపేయవలసిందిగా కోరుతూ 1922 జనవరిలో లేఖ వ్రాశారు. ఈ పరిణామం దేశభక్త కొండా వెంకటప్పయ్య వంటి వారికి అశనిపాతంలా తోచింది. దాంతో ఆయన ఇక్కడ సాగుతున్న ఉద్యమ తీరు తెన్నులను వివరిస్తూ గాంధీజీకి లేఖ వ్రాసి పంపారు. ఉద్యమాన్ని కొనసాగించటానికి గాంధీజీ తిరిగి అనుమతినిచ్చారు.

చౌరీచౌరా : వెల్లడైన భారతీయ పౌరుషం

1922 ఫిబ్రవరి 4న ఉత్తరప్రదేశ్లోని చౌరీచౌరాలో శాంతియుతంగా పికిటెంగ్ చేస్తున్న వాలంటీర్లపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. శాంతి యుతంగా పికెటింగ్ చేస్తున్న వాలంటీర్లపై ఎందుకు చెలరేగారని పోలీసు ఇన్స్పెక్టరును ప్రజలు నిలదీశారు. కానీ పెద్ద మనుష్యుల మాటలతో శాంతించి వెనుదిరిగారు. వెనుదిరిగి పోతున్న వాలంటీర్ల మీద పోలీసులు తుపాకులతో కాల్పులు జరుపగా ఇద్దరు వాలంటీర్లు మరణించారు.

ప్రజలు కోపోద్రిక్తులై పోలీసుస్టేషన్ పై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు తుపాకులు పేల్చారు. చివరకు తూటాలు అయిపోవడంతో స్టేషన్లోకి వెళ్లి తలుపులు బిడాయించుకున్నారు. ఆగ్రహంతో ఉన్న ప్రజలు పోలీసుస్టేషనుకు నిప్పు పెట్టారు. మంటల నుండి బయట పడిన పోలీసులను ప్రజలు కొట్టి మంటలలోకే తోసేశారు. ఆ ఘటనలో 19 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. ఆంగ్లేయ ప్రభుత్వము, పోలీసుల దౌర్జన్యాలతో విసిగిపోయిన ప్రజలు అంతగా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారన్నమాట.

తలవంపులు తెచ్చిన పెద్దల నిర్ణయం

కానీ ప్రజల భావోద్వేగాలతో పనిలేనట్లుగా…. చౌరీచౌరా విషయం తెలియగానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై హింసాయుత చర్యలను నిరసిస్తూ ఉద్యమాన్ని నిలిపి వేయాలని తీర్మానించింది. గాంధీజీ ఫిబ్రవరి 12 నుండి 5 రోజుల పాటు నిరసన దీక్ష పూనారు. ఆంధ్రలో కూడా వెంటనే ఉద్యమాన్ని నిలిపివేయాల్సిందిగా అత్యవసరంగా వర్తమానం పంపారు. ఇక చేసేదేమీ లేక ఆంధ్ర నాయకులు 1922 మార్చిలో ఉద్యమాన్ని నిలిపేశారు.

నిజానికి వారెవరికీ ఉద్యమాన్ని నిలపడం ఇష్టం లేదు. ప్రజలలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న స్వేచ్చాకాంక్షా జ్వాలలపై నీళ్ళు చల్లడం వారికెవరికీ నచ్చలేదు. కానీ గాంధీ మహాత్ముడంతటి వాడి నిర్ణయం. కాదనలేని పరిస్థితి. ఈ పరిస్థితి ఆంధ్ర స్వాతంత్ర్యోద్యమ నాయకులందరికీ తలవంపులు తెచ్చింది. అప్పటివరకూ ఆంగ్లేయ ప్రభుత్వానికి పన్నులు చెల్లించవద్దని ఉద్బోధించినవారే తిరిగి పన్నులు చెల్లించమని చెప్పాల్సి రావడం తలవంపులేగా? ప్రజలలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఎందుకంటే ఉద్యమం జరిగిన నాలుగు నెలల కాలంలో వారెన్నో కష్టనష్టాలకు, బాధలకు, అవమానాలకూ ఓర్చి ఆంగ్లేయ అధికారులు, పోలీసులు, సైన్యం ఎంతగా వేధించినా, హింసించినా, అవమానించినా, ఆడవారిపై అత్యాచారాలకు ఒడిగట్టినా గాంధీ గారి అహింసా సిద్ధాంతానికి కట్టుబడి అన్నిటికీ మౌనం వహించి, అన్నిటినీ సహనంతో భరించారు. తాము పస్తులుండి కూడా ఉద్యమానికి ఆర్ధిక సహకారాన్ని అందించారు. ఈ ఉద్యమం కారణంగా తమకు, తమ మాతృభూమికీ బానిస బంధనాల నుంచి విముక్తి లభిస్తుందని భావించి ఉద్యమానికి అన్ని విధాలా సహకరించారు. కానీ తాము నమ్మి వెన్నంటి నిలచిన నాయకులే నేడు ఏవో అసంబద్ధమైన అంశాలు కారణంగా చూపి ఉద్యమాన్ని నిలిపేశారు. నిన్నటిదాకా పన్ను కట్టొద్దని ఉద్బోధించిన వారే ఇప్పుడు ఫర్వాలేదు చెల్లించమని చెబుతున్నారు. ప్రజలలో కాంగ్రెస్ వాదులపై ఒక విధమైన విముఖత, హేళన భావం ఏర్పడింది.

ఈ పరిస్థితి వీరయ్య చౌదరి వంటి ఆత్మాభిమానం కలిగిన నేతలను బాగా కలవరపెట్టింది. సుమారుగా 100 గ్రామాలలో తన సారధ్యంలో ప్రారంభమై 4 నెలలపాటు ఉదృతంగా సాగిన ప్రజా ఉద్యమం ఒక్కసారిగా ఇలా నీరుగారిపోవటం, తనకు తలవంపులు తేవటం ఆయన సున్నిత హృదయాన్ని గాయపరచింది. అంతే…. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ ప్రజా జీవితంలోకి రాలేదు. ఏ విధమైన రాజకీయాలలోనూ పాలు పంచుకోలేదు.

అసామాన్యుడు, అనన్య సామాన్యుడు

వీరయ్య చౌదరి గారి భార్య పేరు బొల్లమ్మ. అన్ని రైతు కుటుంబాల గృహిణుల మాదిరే ఈమె కష్టించి పని చేస్తూ భర్తకు సహాయకారిగా వుండేది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు బాపయ్య, వెంకటేశ్వర్లు. ఒక కుమార్తె అన్నపూర్ణమ్మ.

ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులుగా వ్యవహరించిన పర్వతనేని, హైదరాబాద్ రేడియో శ్రోతల సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. పెదనందిపాడులో హైస్కూలు, గ్రంథాలయాల ఏర్పాటులో కృషి చేశారు.

ఆయన చిన్న కుమారుడు వెంకటేశ్వరరావు కమ్యూనిష్టు పార్టీలో పని చేస్తూ ప్రభుత్వ నిర్బంధం నుండి తప్పించుకోవటానికి అజ్ఞాతంలో సంచరించేవాడు. ఒకసారి అలా సంచరిస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయాడు. చివరి రోజుల్లో వీరయ్య చౌదరి తన పెద్దకుమారుడయిన బాపయ్య వద్ద వుంటూ 1970 ఫిబ్రవరి 6న హైదరాబాదులో కాలధర్మం చెందారు. నాటికి ఆయన వయస్సు 84 సంవత్సరాలు.

వీరి స్మారక చిహ్నంగా 1992 ఫిబ్రవరిలో పెదనందిపాడులో వీరి శిలా విగ్రహం ఆచార్యరంగా, బెజవాడ గోపాలరెడ్డిల సమక్షంలో ఆవిష్కరింపబడింది. ఒకే ఒక్క ఉద్యమంతో అచిరకాలంలోనే అజరామరమైన ఖ్యాతిని గడించిన వీరయ్య చౌదరి నిస్వార్థ, నిరాడంబర జీవితం మనకందరికీ సదా ఆదర్శం. ఆయనలోని సంఘటనా కౌశలాన్ని మనం సదా అనుసరించాలి. ఆరు వేల మంది శాంతి సైన్యాన్ని తయారు చెయ్యటమంటే మాటలా? అనితర సాధ్యమైన ఘనత సాధించిన వీరయ్య చౌదరి నిజంగా అసామాన్యుడు. అనన్య సామాన్యుడు.

4/10/2021 ఆంధ్రా శివాజీ పర్వతనేని వీరయ్యచౌదరి జయంతి

– శ్రీరాంసాగర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.