
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరులో ఇద్దరు పోలీసులు దొంగలయ్యారు. చిత్తూరులో కలెక్టరేట్‌కు వెళ్ళే రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై చిరు వ్యాపారులు దుస్తులు విక్రయించేవారు. రాత్రి సమయంలో వాటిని మూటగట్టి ఒమిని వ్యాన్‌లో ఉంచి వెళ్ళిపోయారు. ఉదయం వచ్చేసరికి కొన్ని దుస్తులు చోరీకి గురైనట్టు ఒక వ్యాపారి గుర్తించాడు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి, ఆశ్చర్యపోయారు. ఇద్దరు పోలీసులు దొంగిలించినట్టు స్పష్టమైంది.
దీంతో బాధిత వ్యాపారి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో ఏఆర్ ఎస్సై మహమ్మద్ బాషా, ఏఆర్ కానిస్టేబుల్ ఇంతియాజ్ దుస్తులు చోరీ చేసినట్టుగా రుజువైంది.
జిల్లా పోలీసు ఉన్నతాధికారులు నిందితులను సస్పెండ్ చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో కొందరు పోలీసులు పనితీరులో భేష్ అనిపించుకొని, పోలీస్ శాఖ ప్రతిష్ఠ పెంచుతుంటే, ఇటువంటి వారు ఆ కీర్తిని దిగజార్చుతున్నారని ఆ శాఖలోని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆస్తులను రక్షించాల్సిన వారే భక్షించేవారిగా తయారయ్యారని ప్రజలు చీవాట్లు పెడుతున్నారు.
Source: Tv9





