
-
గ్రామ గ్రామాన సామూహిక ఆరతి ఇద్దాం!
-
సామాజిక సమరసతా జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ పిలుపు
చిత్తూరు: మనది దేవాలయ కేంద్రత సమాజం. కంచి, మధుర, పూరి…. వంటి ప్రముఖ నగరాలు దేవాలయం కేంద్రంగా నిర్మాణం అయి ఉండడాన్ని గమనించవచ్చు. మన వ్యవస్థలో దేవాలయం అంటే ప్రార్థన కేంద్రం మాత్రమే కాదు, ధర్మ ప్రచార కేంద్రం, శ్రద్ధా కేంద్రం, విద్యా కేంద్రం, కళల ప్రచార కేంద్రం…. ఇలా ఎన్నో విషయాలకు కేంద్రం. నేడు దేవాలయం మన వ్యక్తిగత భక్తికి కేంద్రంగా మాత్రమే ఉంది. దేవాలయానికి వెళ్ళే ఒక భక్తునికి, మరో భక్తునికి(ఆత్మీయ) సంబంధమే ఉండదు. హిందువులు అనైక్యంగా ఉన్న కారణంగా హిందూ సమాజం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని సామాజిక సమరసతా జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు.
చిత్తూరు జిల్లా, ముచ్చివోలు గ్రామం ఎన్సీ కాలనీ, ముద్దుమూడి ఎస్సీ కాలనీల్లో ఈ నెల ఎనిమిదో తేదీన సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక ఆరతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్యామ్ ప్రసాద్ హాజరై, మాట్లాడారు. ‘సంఫీు శక్తి కలౌ యుగే’ హిందువులం సమైక్యంగా ఉంటేనే హిందూ ధర్మ రక్షింపబడుతుందని, మనం హిందూ ధర్మాన్ని రక్షిస్తే హిందూ ధర్మం మనలను రక్షిస్తుందని పేర్కొన్నారు. ఆ దృష్ట్యా సామూహిక ఆరతి రూపొందించబడిరదని తెలిపారు.
సామూహిక ఆరతి ఎలా చేయాలి?
ప్రతి నెలా ముందుగా నిర్ణయం చేసిన రోజున సామూహిక ఆరతి దేవాలయంలో నిర్వహించాలి. ఆ దేవాలయం చుట్టూ ఉండే భక్తులు కుటుంబ సమేతంగా ఒకే సమయానికి కర్పూర బిల్లతో దేవాలయానికి చేరుకోవాలని శ్యామ్ ప్రసాద్ తెలిపారు. కొంతసేపు భజన చేయాలని, దేవాలయ అర్చకునితో పాటు భక్తులందరూ తమ తమ ప్లాట్లలో ఉన్న కర్పూరాన్ని వెలిగించాలన్నారు. అందరూ ఒకేసారి స్వామికి ఆరతి ఈయాలని, అనంతరం 10/15 నిమిషాలు మన ధర్మంపై ఒక ప్రసంగం ఏర్పాటు చేయాలన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా మన ధర్మం పట్ల అవగాహన, హిందూ ధర్మ రక్షణకు అవసరమైన సామూహిక భక్తి, శక్తి కల్గుతుందని, ఇవీ నేడు మన సమాజానికి అవసరమని పేర్కొన్నారు. గ్రామ గ్రామాన ఇటువంటి సామూహిక ఆరతి కార్యక్రమాలను నిర్వహించాలని శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు.





