
-
క్రైస్తవ దళితులుగా పరిగణలోకి రారు…
-
పుట్టుకతో ఉన్న హక్కులు కోల్పోతారు
– హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు భోని గణేష్
అనకాపల్లి: పుట్టకతో దళితులుగా ఉన్న వారు క్రైస్తవం పుచ్చుకుంటే, ఇక వారి సంగతి అంతేనని, ఇటువంటి వారు క్రైస్తవ దళితులుగా మారిపోరని, భారత రాజ్యాంగం దళితులకు కల్పించిన హక్కులు వీరికి వర్తించవని హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు భోని గణేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఏపీలోని అనకాపల్లిలోని నర్సింగ్ రావుపేట ఉపాధ్యాయ భవన్‌లో ఆదివారం జరిగిన షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి ఆత్మీయ సమావేశంలో పాల్గొని, మాట్లాడారు.
దళితులుగా రిజర్వేషన్లతో ఉద్యోగ అవకాశాలు పొంది మతమార్పిడితో క్రైస్తవులుగా మారిన వారు దళితులు కాలేరని ఆయన అన్నారు. ఇలాంటి వారి వల్ల ఉద్యోగాలు లేక రిజర్వేషన్లలో పోటీ పెరిగి అసలై దళితులు ఉపాధి కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన మా హక్కులు మేము పరిరక్షించుకుంటామని తెలిపారు. 70 ఏళ్ళుగా ఇంకా అంటరానివారిగా గ్రామాల్లో మిగిలిపోతున్నామని ఈ పరిస్థితికి నకిలీ దళితులు కారణం కాదా అని, మత మార్పిడి చేసుకుని ఇంకా దళితులుగానే కొనసాగుతున్న వారిని, ఏ విధంగా దళిత ఉద్యోగి అవుతారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మేము హిందువులుగా జీవన విధానం సాగిస్తూ నేడు వేదం చదువుకొని పూజారులుగా కూడా జీవన విధానం కొనసాగిస్తున్న దళితులు నేడు దేశం మొత్తం మీద కాకుండా కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే సుమారు మూడు వేల మంది ఉన్నారని గణేష్ తెలిపారు. వారిని ప్రభుత్వం ఐదు వేల రూపాయలు నెలవారీ భృతి ఇస్తామని చెప్పి నేటికీ ఆ పనిచేయలేదన్నారు. కానీ కేరళలో ఒక ప్రధాన దేవాలయంలో దళితుడే పూజారిగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
మా హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మైలపల్లి పోతురాజు, మునగపాక మండల అధ్యక్షుడు బి.లక్ష్మణ్ రావు, రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు సింహాద్రి శ్రీనివాసరావు, పిట్లా నాగేశ్వరరావు, డొక్క శివ పిట్ల రామరావు, లంబ అర్జున్ రావు, రేపాక ప్రసాద్, ఎస్ కాళీ, జల్లూరు ఆనంద్, పలివెల చెన్నారావు, కొప్పలకొండ బాబు, మైలపల్లి అప్పల నరసింహం, బాలి సెట్టి శ్రీనివాస రావు, ఉడతా వెంకట మాణిక్యం, నడిపూడి భాస్కర్ రావు, జె. కామరాజు పాల్గొన్నారు.
SOURCE: Chaitanyavardhi, Vaatha





