News

ఆఫ్ఘన్ లో మహిళల గతి అథోగతే

353views

తాము అధికారం చేపట్టాక అఫ్గానిస్థాన్‌లో గతంలో మాదిరిగా మహిళల అణచివేత ఉండదని మాటిచ్చిన తాలిబన్లు దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అధికారికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందే మహిళా హక్కులను ఒక్కొక్కటిగా కాలరాస్తున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలసి చదువుకోకుండా నిషేధం విధించడం; విద్యార్థినులకు బోధించేందుకు పురుషులకు అనుమతి ఇవ్వకపోవడం, టీవీ/ రేడియో ఛానళ్లలో మహిళలు పాడటానికి వీల్లేకపోవడం వంటివి దీనికి తార్కాణాలు. తాము మహిళల హక్కులను గౌరవిస్తామని, అవి ఇస్లామిక్‌ చట్టానికి లోబడి మాత్రం ఉండాలని తాలిబన్లు కరాఖండీగా చెప్పేశారు. మళ్లీ పాతికేళ్ల క్రితం నాటి రోజులొస్తాయేమోననే ఆందోళన మరింత బలపడుతోంది.

మహిళలకు ఉన్నత విద్య ఇక అందని ద్రాక్షేనా?

గత 20 ఏళ్లలో అఫ్గాన్‌ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినుల ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. పురుషులతో కలిసి వారు తరగతులకు హాజరవుతున్నారు. మరోవైపు.. కొద్ది నెలలుగా తాలిబన్లు విశ్వవిద్యాలయాలపై దాడులు చేసి చాలామందిని పొట్టనబెట్టుకున్నారు. దీంతో.. మహిళలు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.

ఆహారం రుచిగా లేదని అతివకు నిప్పు

ఆహారం రుచిగా వండలేదనే కారణంతో ఆగస్టు 17న ఓ మహిళకు తాలిబన్లు నిప్పంటించారు. వారి అరాచకాలు ఎలా ఉంటాయో తెలిపేందుకు ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. జిహాదీలను పెళ్లి చేసుకోవాలని యువతులను తాలిబన్లు బలవంతం చేస్తున్నట్లు మాజీ జడ్జి నజ్లా అయుబి కొద్దిరోజుల క్రితమే తెలిపారు. మహిళలను శవపేటికల్లో బంధించి ఇతర దేశాలకు తరలిస్తున్నారని, అక్కడ వారిని లైంగిక బానిసలుగా మారుస్తున్నారని వెల్లడించారు. అఫ్గాన్‌ చరిత్రలోనే మొట్టమొదటిసారి తాలిబన్ల ప్రతినిధితో ప్రత్యక్ష ప్రసారంలో ఇంటర్వ్యూ చేసిన మహిళా జర్నలిస్టు బెహష్తా అర్ఘాంద్‌(24) ఇప్పుడు దేశం వీడి వెళ్లారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.