
ఒలింపిక్స్ ఆర్చరీ పోటీల్లో భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌తో కూడిన బృందం ప్రిక్వార్టర్స్‌లో 6-2 తేడాతో కజక్‌స్థాన్‌ను ఓడించింది. క్వార్టర్స్‌లో అత్యంత బలమైన, డిఫెండింగ్ ఛాంపియన్ కొరియాతో తలపడనుంది. ఈ పోరులో గెలిస్తే భారత్‌కు కచ్చితంగా పతకావకాశం ఉంటుందని చెప్పొచ్చు!
ప్రిక్వార్టర్స్‌లో భారత్ 6-2 తేడాతో కజక్‌స్థాన్‌ను ఓడించింది. టీమ్‌ఇండియా 55-54, 52-51తో తొలిరెండు సెట్లను కైవసం చేసుకొని ఆధిక్యంలోకి వెళ్లింది. కీలకమైన మూడో సెట్లో భారత్ ఒక పాయింటు తక్కువ చేయడంతో నాలుగో సెట్‌కు వెళ్లాల్సి వచ్చింది. కజక్ 57 స్కోరు సాధించగా భారత్ 56కు పరిమితమైంది. ఇక ఆఖరి సెట్లో భారత్ 55-54తో విజయ దుందుభి మోగించింది. కాగా అంతకుముందు మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ భారత్.. కొరియా చేతిలోనే ఓడిన సంగతి తెలిసిందే.





